22 ఏప్రిల్ 2025న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. కాకపోతే, 25 ఏప్రిల్ 2025న తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసిన కొత్త ప్రకటనలో, TRF పహల్గామ్ సంఘటనలో తమ ప్రమేయం లేదని, అంతకు ముందు చేసిన ప్రకటనతో తమకు సంబంధం లేదని తెలిపింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై కాల్పులకు తెగపడ్డారు. మతం అడిగిన తర్వాత ఉగ్రవాదులు పురుషులను లక్ష్యంగా చేసుకుని కాల్చి చంపారని బాధితులు చెప్పినట్లు పలు మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ). రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు (ఇక్కడ, ఇక్కడ).
పహల్గామ్ దాడి తర్వాత, తీవ్రవాదులకు పాకిస్థాన్ మద్దతు ఇస్తోందని భావించిన భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై పలు ఆంక్షలు విధించింది. భారతదేశం 1960 సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది, పాకిస్తాన్ సైనిక సలహాదారులను న్యూఢిల్లీ నుండి బహిష్కరించింది, ఇస్లామాబాద్ నుండి తన సొంత సైనిక సలహాదారులను ఉపసంహరించుకుంది. భారత ప్రభుత్వం అన్ని పాకిస్థాన్ సరిహద్దు క్రాసింగ్‌లను మూసివేసింది. పాకిస్తాన్ పౌరులకు వీసాలపై ఆంక్షలను విధించింది, వారిని 48 గంటల్లోపు భారతదేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అలాగే, భారత పౌరులను వెంటనే పాకిస్తాన్ నుండి తిరిగి రావాలని సూచించింది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ నుండి పాక్ సైనిక, నావికాదళ, వైమానిక సలహాదారులను కూడా భారత్ బహిష్కరించింది. దీనికి ప్రతిస్పందిస్తూ, పాకిస్తాన్ భారతదేశంతో వాణిజ్యాన్ని నిలిపివేసింది. భారత విమానాలకు తన గగనతలాన్ని మూసివేసింది, భారత దౌత్యవేత్తలను బహిష్కరించింది.
ఈ నేపథ్యంలో, భారత్ తీసుకున్న నిర్ణయాలకి సంపూర్ణ మద్దత్తు ప్రకటిస్తున్నామని, ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న యుద్ధంలో తోడుగా నిలుస్తామని, ఈ దాడికి పాల్పడిన పాకిస్థాన్ ను దోషిగా నిలబెట్టాలని అమెరికన్ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నట్లుగా ఉన్న వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: పహల్గామ్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పై భారత్ తీసుకున్న చర్యలకు మద్దతుగా మాట్లాడుతున్న అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
ఫాక్ట్: ఇది AI ద్వారా రూపొంచించబడిన వీడియో. అసలు వీడియోలో 07 ఫిబ్రవరి 2019న వాషింగ్టన్లో జరిగిన నేషనల్ ప్రేయర్ బ్రేక్ఫాస్ట్ అనే కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ వివిధ రాజకీయ, సామాజిక, మతపరమైన విషయాల గురించి మాట్లాడారు. అయితే, పహల్గామ్ దాడిని ఖండిస్తూ, ఉగ్రవాదంపై దాడిలో భారత్‌కు మద్దతు తెలుపుతున్నానని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భారత్, పాకిస్తాన్ రెండూ తనకి మిత్రదేశాలేనని, కాశ్మీర్ సమస్యని ఇద్దరూ కలిసి పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. కావున పోస్టులో చేయబడిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన అసలు వీడియో లభించింది. ఈ వీడియోని 07 ఫిబ్రవరి 2019లో ‘ది ఇండిపెండెంట్’, ‘ఫాక్స్ న్యూస్’ తదితర మీడియా సంస్థలు తమ యూట్యూబ్ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు గుర్తించాం.
మీడియా కథనాల ప్రకారం(ఇక్కడ & ఇక్కడ) , 07 ఫిబ్రవరి 2019న వాషింగ్టన్లో జరిగిన నేషనల్ ప్రేయర్ బ్రేక్ఫాస్ట్ అనే కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ వివిధ రాజకీయ, సామాజిక, మతపరమైన విషయాల గురించి మాట్లాడారు. ఇక వైరల్ వీడియోలోని ఆడియోని పరీక్షించగా అది AI ద్వారా రూపొందించినట్లు తెలిసింది.
ఇక పహల్గాం ఉగ్రదాడిపై ఈ ఘటనను ఖండిస్తూ ఉగ్రవాదంపై దాడిలో భారత్‌కు మద్దతు తెలుపుతామని సోషల్ మీడియాలో ట్రంప్ పోస్టు చేశారు. అయితే, భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ), “నాకు భారత్, పాకిస్తాన్ రెండిటితో దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇరు దేశాలు కాశ్మీర్‌లో వెయ్యి సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాయి. కాశ్మీర్ సమస్య వెయ్యి సంవత్సరాలుగా కొనసాగుతోంది, బహుశా దాని కంటే ఎక్కువే కావచ్చు. అది(ఉగ్రవాద దాడి) నీచమైన చర్య. ఆ సరిహద్దులో 1,500 సంవత్సరాలుగా ఉద్రిక్తతలు ఉన్నాయి. ఇది అలాగే ఉంది, కానీ వారు ఏదో ఒక విధంగా దాన్ని పరిష్కారించుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నాకు ఇద్దరు నాయకులు తెలుసు. పాకిస్తాన్, భారతదేశం మధ్య తీవ్రమైన ఉద్రిక్తత ఉంది ప్రస్తుతమే కాదు, ఎప్పటినుంచో ఉంది” అని అన్నారు.
చివరిగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ తీసుకున్న చర్యలకు ట్రంప్ మద్దతిస్తున్నారంటూ AI ద్వారా రూపొందించిన వీడియోని షేర్ చేస్తున్నారు.