మతపరమైన భావాలను అవమానించాడనే పుకార్ల నేపథ్యంలో, 18 డిసెంబర్ 2025న బంగ్లాదెశ్‌లోని మైమెన్‌సింగ్ జిల్లాలో, దీపు చంద్ర దాస్‌ను అనే హిందూ యువకుడుని కొందరు దారుణంగా కొట్టి చంపి, అతని మృతదేహాన్ని ఒక రహదారిపై దహనం చేశారు. అయితే ఇతనిపై చేసిన దైవదూషణ ఆరోపణకు మద్దతు ఇచ్చే ఆధారాలు ఏవీ లభించలేదని ఆ దేశ పోలీసులు, RAB అధికారులు ప్రకటించారు. దర్యాప్తు కొనసాగుతున్నందున అనేక మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌లో ఉంచారు. ఈ హత్య బంగ్లాదేశ్, విదేశాలలో విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది, అధికారులు ఈ చర్యను మూక హింసగా ఖండించారు, అలాగే పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).
ఈ నేపథ్యంలో, తమను ఎవరైనా కాపాడండి అని ఒక బంగ్లాదేశీ హిందూ వేడుకుంటున్న దృశ్యాలని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, నిప్పులు మయం అయి ఉన్న కొన్ని నివాసాల మధ్య ఒక వ్యక్తి మాట్లాడుతూ, ఇక్కడ ఏం జరుగుతుందో మీరే చూడవచ్చు, మమ్మల్ని కూడా దీపు చాదర్ (దీపు చంద్ర దాస్) లాగా చంపేస్తారని అనడం మనం చూడవచ్చు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్ : బంగ్లాదేశీ హిందూ వ్యక్తి, అక్కడి ఉద్రిక్త వాతావరణాన్ని ఒక వీడియో ద్వారా చూపిస్తూ, తమను రక్షించమని కోరుతున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో, బంగ్లాదేశీ హిందువు అక్కడి పరిస్థితులు చూపిస్తున్న నిజమైన వీడియో కాదు. ఇది AI-జనరేటెడ్ వీడియో అని, AI కంటెంట్ డిటెక్షన్ టూల్స్ గుర్తించాయి. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా, మాకు వైరల్ వీడియో గురించి ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు, ఆధారాలు లభించలేదు. కానీ, ఈ వీడియో యొక్క అన్-క్రాప్డ్ వెర్షన్ (Uncropped version) మాకు ‘X’ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో లభించింది.
అయితే, ఈ వీడియోలున్న పోస్టుల కింద, కొందరు యూజర్లు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసినదని అనడం మేము గమనించాము. ఈ విషయాన్ని వెరిఫై చేయడానికి ఈ వీడియోని Hive, Deepfake-o-meter వంటి AI కంటెంట్ డిటెక్షన్ టూల్స్ ఉపయోగించి చెక్ చేశాము. ఇది AI జనరేటెడ్ వీడియో అని అవి రెండు గుర్తించాయి (ఇక్కడ, ఇక్కడ).
ఇక ఈ వీడియో గురించి మరిన్ని వివరాల కోసం, దాన్ని ఉపయోగించి ఇంటర్నెట్‌లో ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ డిజిటల్ క్రియేటర్ ‘Kuldeep Meena’ ఈ వీడియోను 24 డిసెంబర్ 2025న పోస్ట్ చేశాడని మాకు తెలిసింది. ఇతని పేజీలో ఇటువంటి AI-జనరేటెడ్ వీడియోలు ఉన్నాయి.
చివరగా, ఒక బంగ్లాదేశీ హిందూ వ్యక్తి, అక్కడి ఉద్రిక్త వాతావరణాన్ని ఒక వీడియో ద్వారా చూపిస్తూ, తమను రక్షించమని కోరుతున్న నిజమైన వీడియో అని చెప్తూ ఒక AI-జనరేటెడ్ వీడియో షేర్ చేస్తున్నారు.