శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా వారణాసి ఘాట్‌ వద్ద కోతులకు ఆహారం పెట్టిన దృశ్యాలంటూ AI ద్వారా రూపొందించిన వీడియోను షేర్ చేస్తున్నారు

ఇటీవల 16 ఆగస్ట్ 2025న భారతదేశం అంతటా శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఘనంగా జరుపుకున్నారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ నేపథ్యంలో, ఓ నది ఘాట్ లాంటి ప్రాంతంలో ఓ కోతి గుంపు వరుస క్రమంలో కూర్చొన్ని అరటి ఆకులపై వడ్డించిన ఆహారాన్ని తింటున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). “వారణాసి ఘాట్ వద్ద చాలా అందమైన దృశ్యం జన్మాష్టమి నాడు కోతి సైన్యానికి ఆహారం” అంటూ ఇది నిజమైన ఘటనగా పలువురు యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2025 శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకుల సందర్భంగా వారణాసి ఘాట్‌ వద్ద కోతులకు ఆహారం పెట్టిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో నిజమైన సంఘటనను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని Hive, గూగుల్ వారి SynthID వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి. అలాగే, 2025 శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా వారణాసిలోని ఘాట్ల వద్ద కోతులకు ఇలా ఆహారం పెట్టినట్లు కూడా ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోను జాగ్రతగా పరిశీలిస్తే, ఇందులో పలు తప్పిదాలు/ అసమానతలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ వీడియోలో కనిపిస్తున్న మనుషుల, కోతుల యొక్క కదలికలు అసహజంగా ఉండటం మనం చూడవచ్చు. ఈ వీడియోలో ఒక పోలీసు అధికారి రైఫిల్ (గన్), జెండా రెండింటినీ పట్టుకున్న ఉన్న దృశ్యాలలో స్పష్టమైన అసమానతలను మనం చూడవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడిన దృశ్యాలలో ఇటువంటి లోపాలు సహజంగానే ఉంటాయి (ఇక్కడఇక్కడ). దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించి ఉండవచ్చని తెలుస్తోంది.

తదుపరి ఈ వైరల్ వీడియో AI- ఉపయోగించి తయారు చేసిందా? లేదా? అని నిర్ధారించడానికి, Hive వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఉపయోగించి ఈ వైరల్ వీడియోను పరిశీలించగా, ఈ వీడియో 99.9% AI- జనరేటెడ్ కావచ్చని Hive ఫలితాన్ని ఇచ్చింది.

అలాగే, గూగుల్ AI మోడల్స్ ఉపయోగించి రూపొందించబడిన దృశ్యాలను గుర్తించే గూగుల్ వారి ‘సింథ్ ID (synth ID)’ టూల్ ఉపయోగించి ఈ వైరల్ వీడియోను పరిశీలించగా, ఈ వీడియో గూగుల్ AI ని ఉపయోగించి సృష్టించబడిందని నిర్ధారించింది. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని మనం నిర్ధారించవచ్చు.

అలాగే, 2025 శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా వారణాసిలోని గంగా నది ఒడ్డున ఉన్న ఘాట్ల వద్ద కోతులకు ఇలా ఆహారం పెట్టినట్లు కూడా ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు.

చివరగా, శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా వారణాసి ఘాట్‌లో కోతులకు ఆహారం పెట్టిన దృశ్యాలంటూ షేర్ అవుతున్న ఈ వీడియో AI ఉపయోగించి రూపొందించబడింది.