కిలిమంజారో పర్వత గగన దృశ్యాలని కైలాస పర్వతం దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు

కైలాస పర్వత విహంగ వీక్షణ దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. భారత ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా మొట్టమొదటిసారి కైలాస శిఖరం పై ఉన్న దృశ్యాలని చుడగలుగుతున్నట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కైలాస పర్వతం విహంగ వీక్షణ దృశ్యాలని చూపుతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్నది ఆఫ్రికా దేశంలోని కిలిమంజారో పర్వతం, చైనా ఆక్రమిత టిబెట్ ప్రాంతంలోని కైలాస పర్వతం కాదు. రిజ్వాన్ రేమ్తుల్లా అనే ఒక పైలట్, కిలిమంజారో పర్వతాన్ని 360 డిగ్రీలు చుట్టుతూ ఈ గగన దృశ్యాలని రికార్డ్ చేసాడు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Tanzania Budget Safaris’ అనే ఫేస్బుక్ పేజి 25 జూలై 2017 నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో కనిపిస్తున్నది ఆఫ్రికా దేశంలోని కిలిమంజారో పర్వతం అని వివరణలో తెలిపారు. రిజ్వాన్ రేమ్తుల్లా అనే ఒక పైలట్, టాంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని 360 డిగ్రీలు చుట్టుతూ ఈ దృశ్యాలని తీసినట్టు కొన్ని ట్రావెల్ వెబ్సైట్లు, ఈ వీడియోని ఫేస్బుక్లో షేర్  చేసాయి. ఆ పోస్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

పోస్టులో షేర్ చేసిన అవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Daily News Digital’ న్యూస్ సంస్థ తమ యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసింది. ఈ వీడియోలో కనిపిస్తున్నది ఆఫ్రికా దేశంలోని కిలిమంజారో పర్వతమని ఈ న్యూస్ ఛానల్ స్పష్టం చేసింది.

చైనా ఆక్రమిత టిబెట్ ప్రాంతంలోని ‘Mountain Kangrinboqe’ (చైనా దేశంలో కైలాస పర్వతాన్ని ‘Mountain Kangrinboqe’ అని  పిలుస్తారు) ఫోటోలని ‘VTIBET’ న్యూస్ సంస్థ తమ ఆర్టికల్‌లో పబ్లిష్ చేసింది. కైలాస పర్వత విహంగ వీక్షణ దృశ్యాలని ఈ ఆర్టికల్‌లో చూడవచ్చు. చైనా న్యూస్ సంస్థ ‘CGTN’ కూడా కైలాస పర్వత విహంగ వీక్షణ దృశ్యాలని తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసింది. ఈ వీడియోలో కనిపిస్తున్న కైలాస పర్వత దృశ్యాలు, పోస్టులో షేర్ చేసిన వీడియోలోని దృశ్యాలతో పోలి లేవు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తుంది ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతమని, కైలాస పర్వతం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, కిలిమంజారో పర్వత విహంగ వీక్షణ దృశ్యాలని కైలాస పర్వతం దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.