Fake News, Telugu
 

సినీ నటుడు సుమన్ ఇండియన్ ఆర్మీ జవాన్ల కోసం 117 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇంకా అందించలేదు

0

ప్రముఖ తెలుగు సినీ నటుడు సుమన్ ఇండియన్ ఆర్మీ కోసం 117 ఎకరాల స్థలాన్ని విరాళంగా అందించినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి పుణ్యక్షేత్రానికి అతి సమీపంలో ఉన్న 117 ఎకరాల తన భూమిని సుమన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఇండియన్ ఆర్మీకి అందచేసినట్టు ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.   

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: సినీ నటుడు సుమన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 117 ఎకరాల తన స్థలాన్ని ఇండియన్ ఆర్మీకి విరాళంగా అందచేసారు.

ఫాక్ట్ (నిజం): భువనగిరి సమీపంలో తమ కుటుంబం చాలా సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన 175 ఎకరాల స్థలాన్ని ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సినీ నటుడు సుమన్ 2019లోనే మీడియాతో తెలిపారు. అయితే, డబుల్ రిజిస్ట్రేషన్ల కారణంగా ఆ భూములపై కోర్టులో కేసు నడుస్తుందని, న్యాయస్థానం తీర్పులో తమకు అనుకూలంగా ఎంత భూమి వస్తే అంత భూమిని సైనికులకే ఇస్తానని సుమన్ అప్పుడు స్పష్టం చేసారు. కేసీఆర్ చేతుల మీదుగా తాను 117 ఎకరాల స్థలాన్ని ఇండియన్ ఆర్మీకి అందచేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం తప్పని సుమన్ మీడియాతో స్పష్టం చేసారు. ఈ భూమికి సంబంధించి కోర్టులో ఇంకా కేసు నడుస్తుందని, వివాదానికి పరిష్కారం లభించిన వెంటనే వ్యక్తిగతంగా తానే వచ్చి  ఏ విషయమన్నది తెలియజేస్తానని సుమన్ మీడియాకు తెలిపారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, సినీ నటుడు సుమన్ తన 175 ఎకరాల స్థలాన్ని ఇండియన్ ఆర్మీ కోసం విరాళంగా ప్రకటించిన విషయాన్ని ‘ETV Telangana’ న్యూస్ ఛానల్ 2019 జూన్ నెలలో రిపోర్ట్ చేసినట్టు తెలిసింది. భువనగిరి సమీపంలో తమ కుటుంబం చాలా సంవత్సరాల క్రితం 175 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసిందని, అందులో ఆయుర్వేద రిసార్ట్ నిర్మించాలని మొదటగా అనుకున్నట్టు సుమన్ ఈ వీడియోలో తెలిపారు. కానీ, ఆ తరువాత తమ కుటుంబం ఈ భూమిని ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సుమన్ ఈ ఇంటర్వ్యూలో తెలిపారు.

అయితే, డబుల్ రిజిస్ట్రేషన్ల కారణంగా ఆ భూములపై కోర్టులో కేసు నడుస్తుందని, న్యాయస్థానం తీర్పు వచ్చిన వెంటనే ఈ స్థలాన్ని సైనికులకు అందిస్తానని సుమన్ ‘ETV’ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 2020లో ‘TOI సమయం’ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఈ స్థలానికి సంబంధించిన వివాదం ఇంకా కోర్టులో నడుస్తుందని, న్యాయస్థానం తీర్పులో తమకు అనుకూలంగా ఎంత భూమి వస్తే అంత భూమిని సైనికులకే ఇస్తానని సుమన్ తెలిపారు.

కేసీఆర్ చేతుల మీదుగా తాను 117 ఎకరాల స్థలాన్ని ఇండియన్ ఆర్మీకి అందచేసినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పని సుమన్ మీడియాకు స్పష్టం చేసారు. ఈ వైరల్ పోస్టుకి సంబంధించి సుమన్ మీడియాతో, “సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. వాటిని ఎవరూ నమ్మొద్దు. ఆ భూమికి సంబంధించిన వివాదం ఇంకా కోర్టులో కొనసాగుతోంది. వివాదానికి పరిష్కారం రాగానే వ్యక్తిగతంగా నేనే వివరాలు మీడియా ద్వారా వెల్లడిస్తాను. దానికి సంబంధించి ఏ విషయమైనా నేనే చెబుతాను”, అని తెలిపారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా,  సిని నటుడు సుమన్ ఇండియన్ ఆర్మీ జవాన్ల కోసం 117 ఎకరాల స్థలాన్ని విరాళంగా అందించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll