భారతదేశానికి చెందిన 75 ఏళ్ల అబ్దుల్ అనే ట్రక్ డ్రైవర్, ఆరుగురు భార్యలు, 54 మంది పిల్లలు, అన్నదమ్ములతో కలిపి మొత్తంగా 150 మందితో ఒక చిన్న కాలనీనే తయారుచేసి నడిపిస్తున్నాడాని, ఈ మధ్యనే అబ్దుల్ గుండె నొప్పితో మరణించడంతో వాళ్ళని ఆదుకోవాలని వారు ఇప్పుడు కోరుతున్నారని తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. పిల్లలను కనడం వాళ్ళ వంతు అయితే, టాక్స్‌లు కట్టి వాళ్ళని మేపడం మిగితా వారి వంతయ్యిందని ఈ ఫోటోని షేర్ చేస్తూ తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: భారతదేశంలో అబ్దుల్ అనే వ్యక్తి ఆరుగురు భార్యలు, 54 మంది పిల్లలు, అన్నదమ్ములతో కలుపుకొని మొత్తంగా 150 మందితో చిన్న కాలనీనే తయారుచేశాడు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్నది బలూచిస్తాన్‌కు చెందిన ఒక కుటుంబం. ఆరు సార్లు పెళ్లి చేసుకొని, 54 మంది పిల్లలకు తండ్రి అయిన అబ్దుల్ మజీద్ మెంగల్, 2022లో గుండె పోటుతో మరణించారని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఈ ఫోటోలో కనిపిస్తున్న కుటుంబానికి భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ 2022 డిసెంబర్ నెలలో పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. 54 మంది పిల్లలకు తండ్రైన బలూచిస్తాన్‌కు చెందిన అబ్దుల్ మజీద్ మెంగల్ గుండె పోటుతో మరణించారని ‘ది కాశ్మీర్ మోనిటర్’ వార్తా సంస్థ తమ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది.
ట్రక్ డ్రైవరుగా పనిచేసే అబ్దుల్ మజీద్ మెంగల్, 6 సార్లు పెళ్లి చేసుకొని 54 మంది పిల్లలను కన్నాడని, వారిలో 12 మంది ఆకలి బాధలతో చనిపోగా, ప్రస్తుతం 42 మంది పిల్లలు జీవించి ఉన్నారని తెలిసింది. పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రొవిన్స్‌కు చెందిన అబ్దుల్ మజీద్ మెంగల్, 2022లో గుండె పోటుతో మరణించాడని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్నది బలూచిస్తాన్‌కు చెందిన కుటుంబం అని, భారత దేశానికి నివసిస్తున్న కుటుంబం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, 54 పిల్లలకు తండ్రై 75 ఏళ్ల వయసులో గుండెపోటుతో చనిపోయిన అబ్దుల్ మజీద్ మెంగల్ పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌కు చెందిన వ్యక్తి, భారత దేశానికి సంబంధించిన వాడు కాదు.