వీడియోలోని ప్రసంగం లో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ‘జరియా’ అన్నారు, ‘షరియా’ కాదు.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ తన ప్రసంగంలో ‘అల్లా దయతో ఈ దేశం షరియా దేశం కాబోతుంది’ అని అన్నాడని, అందుకు సంబంధించిన వీడియో క్లిప్ అంటూ ఒక దాన్ని ఫేస్బుక్ లో పోస్టు చేస్తున్నారు. అందులో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వీడియోలోని ప్రసంగంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ‘అల్లాహ్ దయతో ఈ దేశం షరియా దేశం కాబోతుంది’ అని అన్నాడు.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని ప్రసంగం లో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా భారత దేశం ‘షరియా’ దేశం కాబోతుందని వ్యాఖ్యానించలేదు. ఆయన ఆ ప్రసంగంలో ‘జరియా’ అన్నారు, ‘షరియా’ కాదు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

అమానతుల్లా ఖాన్ ఢిల్లీ లోని ‘ఓఖ్లా’ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే. బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రా కూడా అమానతుల్లా తన  ప్రసంగం లో భారత దేశం ‘షరియా’ దేశం కాబోతుందని వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ ట్వీట్ (ఆర్కైవ్డ్) పెట్టాడు.

పోస్టులోని వీడియోలో ‘Breaking News Express’ లోగో కనిపిస్తుంది. దాంతో, యూట్యూబ్ లో కీవర్డ్స్ తో వెతికినప్పుడు, వీడియో క్లిప్ యొక్క పూర్తి వీడియో లభించింది. దాంట్లో, క్లిప్ కి సంబంధించిన భాగాన్ని 3:21 నిడివి తర్వాత వినవచ్చు. ఆ వీడియో ని ‘2 ఫిబ్రవరి 2020’ న అప్లోడ్ చేసినట్లుగా ఉంది మరియు టైటిల్ ‘AMANULLAH KHAN, JAMIA MLA, WARNS ABOUT CAA, NRC & NPR’ అని ఉంది. అమానతుల్లా తన ప్రసంగంలో ‘ఓఖ్లా’ నియోజకవర్గ ప్రజలను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కి ఓట్ వేయాలని కోరుతారు మరియు జామియాలో షూటింగ్స్ ని ప్రస్తావించి, ఈ వ్యాఖ్యలు చేశారు- ‘అల్లా ఈ అన్యాయవాదుల పతనాన్ని నిర్ణయించాడు.. వారు చేసిన హింస ముగుస్తుంది.. ఆ హింస కి ముగింపు ఓఖ్లా నుండి మొదలవుతుంది.. జామియా నుండి మొదలవుతుంది.. మేము మాధ్యమంగా మారుతాము ఇన్షాల్లాహ్ మరియు అది ఎక్కడో ఒక దగ్గర నుండి మొదలవుతుంది’ అని అంటారు. తన ప్రసంగంలో అమానతుల్లా ‘జరియా’ (మాధ్యమం/మార్గం) అన్నారు, ‘షరియా’ (ఇస్లామిక్ చట్టం) కాదు.

చివరగా, వీడియోలోని ప్రసంగం లో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా భారత దేశం ‘షరియా’ దేశం కాబోతుందని అనలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?