ప్రధాన మంత్రి మోదీతో గ్రూప్ ఫోటోలో ఉన్న యువతి గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కాదు; పాయల్ ధరే అనే ఒక గేమర్

హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్, యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రాను హిసార్ పోలీసులు 17 మే 2025న పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై అరెస్టు చేశారు. రిపోర్ట్స్ ప్రకారం, ఆమె వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ లాంటి ఎన్క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా భారతదేశనికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ).

ఈ నేపథ్యంలో, ప్రధాన మంత్రి మోదీ ఒక యువతి, కొంతమంది యువకులతో కలిసి ఉన్న గ్రూప్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందులో ఉన్న యువతి జ్యోతి మల్హోత్రా అని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఫోటోలో ప్రధాని మోదీతో ఉన్న యువతి నిజంగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రానా? అని నిర్థారించాలని కోరుతూ మా వాట్సాప్‌ టిప్‌లైన్‌కు (+91 9247052470) కూడా పలు అభ్యర్ధనలు వచ్చాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: పాకిస్తాన్ కు భారతదేశ సమాచారాన్ని గూఢచర్యం చేస్తుందనే ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ప్రధాన మంత్రి మోదీతో కలిసి ఉన్న ఫోటో.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ ఫోటోలో కనిపిస్తున్న యువతి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కాదు . ఈ ఫొటోలో ఉన్నది పాయల్ ధరే, ఈమె ఒక ప్రముఖ గేమర్‌. ఏప్రిల్ 2024లో ప్రధాని మోదీ భారతదేశానికి చెందిన టాప్ గేమర్లను కలిసి గేమింగ్ ఇండస్ట్రీ ఎదుగుదల, క్రియేటివిటీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, గేమింగ్‌-గాంబ్లింగ్‌ మధ్య తేడా, అలాగే మహిళల పాల్గొనడం వంటి అంశాలపై చర్చించారు, ఈ ఫోటో అప్పడు తీసినది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ ఫోటోకు సంబంధించిన మరింత సమాచారం కోసం గూగుల్ లెన్స్‌తో సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను కలిగి ఉన్న వీడియో ఒకటి మాకు లభించింది. ఈ వీడియో 13 ఏప్రిల్ 2024న ప్రధాన మంత్రి మోదీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడింది. వీడియో వివరణ ప్రకారం,  ప్రధాన మంత్రి మోదీ భారతదేశంలోని ప్రముఖ గేమర్‌లు తీర్థ్ మెహతా, పాయల్ ధరే, అనిమేష్ అగర్వాల్, అన్షు బిష్త్, నమన్ మాథుర్, మిథిలేష్ పాటంకర్, గణేష్ గంగాధర్‌లతో కలిసి PC, VR గేమ్‌లు ఆడారు. ఈ సందర్భంగా గేమింగ్ ఇండస్ట్రీ ఎదుగుదల, క్రియేటివిటీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, గేమింగ్‌-గాంబ్లింగ్‌ మధ్య తేడా, అలాగే మహిళల పాల్గొనడం వంటి అంశాలపై చర్చ జరిగింది అని, వీడియోలో ఉన్న యువతి పాయల్ ధరే, తను జ్యోతి మల్హోత్రా కాదని మాకు తెలిసింది.

వీడియో వివరణలో పాయల్ ధరే యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ ఉన్నట్లు మేము గుర్తించాము. ప్రధాన మంత్రి మోదీని కలిసిన సందర్భంగా పాయల్ ధరే 13 ఏప్రిల్ 2024న తన యూట్యూబ్ ఛానెల్‌లో ఇదే వీడియోను అప్‌లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము.

ఈ భేటీకి సంబంధించిన మరికొన్ని పోస్ట్‌లను (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). మేము పాయల్ ధరే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో మేము కనుగొన్నాము.

గతంలో ప్రధాన మంత్రి మోదీ, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కలిసినట్లు కూడా ఎలాంటి  ఆధారాలు, విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు.

చివరిగా, ప్రధాన మంత్రి మోదీతో గ్రూప్ ఫోటోలో ఉన్న యువతి గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కాదు; తను పాయల్ ధరే అనే ఒక వీడియో గేమర్.