నేపాల్‌లోని ఖాట్మండులో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించిన వీడియోను భారతదేశానికి ముడిపెడుతూ తప్పుగా షేర్ చేస్తున్నారు

భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలకు చెందిన అక్రమ నిర్మాణాలను భారత అధికారులు, భద్రతా దళాలు కూల్చేస్తున్న దృశ్యాలు అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఒక బుల్డోజర్ ఒక నిర్మాణాన్ని కూల్చివేస్తుండగా ఓ యువతి ఆ బుల్డోజర్‌ను ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, భద్రతా సిబ్బంది ఆమెను ఆపడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలకు చెందిన అక్రమ నిర్మాణాలను భారత అధికారులు, భద్రతా దళాలు కూల్చివేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో భారతదేశానికి సంబంధించింది కాదు. ఈ వైరల్ వీడియో 15 ఆగస్టు 2025న నేపాల్‌లోని ఖాట్మండులో మనోహర నది ఒడ్డున ఉన్న అక్రమ నిర్మాణాలను అక్కడి మున్సిపల్ అధికారులు కూల్చివేసిన దృశ్యాలను చూపిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను చూపిస్తున్న వీడియోను 16 ఆగస్టు 2025న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యూజర్ షేర్ చేసినట్లు గుర్తించాము. ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ వీడియో నేపాల్‌కు సంబంధించింది అని తెలుస్తుంది.

అలాగే ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ వీడియోలో కనిపిస్తున్న భద్రతా సిబ్బంది ధరించిన యూనిఫామ్‌లపై ‘KMC’ అని రాసి ఉండటాన్ని మనం చూడవచ్చు. దీని ఆధారంగా, గూగుల్‌లో వెతకగా, ఈ వీడియోలో కనిపిస్తున్న భద్రతా సిబ్బంది ఖాట్మండు మెట్రోపాలిటన్ నగరం (Kathmandu Metropolitan City) పోలీసులు అని తెలిసింది (ఇక్కడ & ఇక్కడ).

దీని ఆధారంగా ఈ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, 15 ఆగస్ట్ 2025న పలు నేపాలీ మీడియా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, 15 ఆగస్టు 2025న నేపాల్‌లోని ఖాట్మండులో మనోహర నది ఒడ్డున ఉన్న అక్రమ నిర్మాణాలను ఖాట్మండు మున్సిపల్ అధికారులు కూల్చివేశారు, దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ కథనాలలో రిపోర్ట్ చేయబడిన దృశ్యాలను వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను పోల్చి చూస్తే, ఈ వైరల్ వీడియో 15 ఆగస్టు 2025న ఖాట్మండులో జరిగిన అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించిందని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, నేపాల్‌లోని ఖాట్మండులో మనోహర నది ఒడ్డున అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించిన వీడియోను భారతదేశానికి ముడిపెడుతూ తప్పుగా షేర్ చేస్తున్నారు.