షిల్లాంగ్‌లో ఒక యువకుడు పాఠశాల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన దృశ్యాలను చూపిస్తున్న వీడియోను తప్పుడు మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు

“అస్సాంలో పాఠశాల విద్యార్థిని స్కర్టును ఎత్తి ఫోటో తీసి, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడి ముస్లిం వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అస్సాంలో ఒక ముస్లిం వ్యక్తి పాఠశాల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో 23 మే 2025న మేఘాలయలోని షిల్లాంగ్ పట్టణంలోని లుమ్డియెంగ్‌జ్రీ (Lumdiengjri) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్సోహ్సాన్‌లో హిమాన్ గొగోయ్ అనే అస్సామీ యువకుడు ఒక పాఠశాల విద్యార్థిని స్కర్ట్ ఎత్తి ఆమెను ఫోటో తీసిన సంఘటనకు సంబంధించినది. రిపోర్ట్స్ ప్రకారం, తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా పోలీసులు హిమాన్ గొగోయ్‌ను 29 మే 2025న అరెస్టు చేశారు. “ఈ సంఘటనలో నిందితుడు పేరు హిమాన్ గొగోయ్, అతను అస్సాంకు చెందినవాడు, అలాగే అతను ముస్లిం కాదు” అని తూర్పు ఖాసీ హిల్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (city), హెర్బర్ట్ పైనైద్ ఖార్కోంగోర్ Factly కి చెప్పారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ, న్యూస్ ఛానల్ నార్త్ ఈస్ట్ లైవ్ (Northeast Live) వారి అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 29 మే 2025న షేర్ చేసిన న్యూస్ వీడియో ఒకటి లభించింది. ఈ న్యూస్ వీడియో కథనం ప్రకారం, షిల్లాంగ్‌లోని లుమ్డియెంగ్‌జ్రీ (Lumdiengjri) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్సోహ్సాన్‌లో ఒక పాఠశాల విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి తూర్పు ఖాసీ హిల్స్ పోలీసులు అస్సాంలోని జోర్హాట్‌కు చెందిన హిమాన్ గొగోయ్ అనే 24 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు.

దీని ఆధారంగా ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, పలు వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).  ఈ సంఘటన 23 మే 2025న ఉదయం సుమారు 6:35 గంటల సమయంలో లుమ్డియెంగ్‌జ్రీ (Lumdiengjri) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్సోహ్సాన్‌లో YWCAకి వెళ్లే లేన్‌లో జరిగింది. ఈ ఘటనపై లుమ్డియెంగ్‌జ్రీ పోలీస్ స్టేషన్‌లో బిఎన్‌ఎస్ (BNS) సెక్షన్లు 76, 79, పోక్సో చట్టంలోని సెక్షన్లు 11, 12 కింద FIR (కేసు నంబర్ 55(05)2025) నమోదు చేయబడింది. 19 మే 2025న పోలీస్ బజార్‌లోని డ్రీమ్‌ల్యాండ్‌లోని మెట్ల దగ్గర మరో పాఠశాల విద్యార్థినిపై ఇలాంటి సంఘటన జరిగింది. దీనిపై పోక్సో చట్టంలోని సెక్షన్లు 7,8 కింద సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నంబర్ 140(5)2025తో FIR నమోదు చేయబడింది. ఈ కథనాల ప్రకారం, నిందితులను గుర్తించి పట్టుకోవడానికి తూర్పు ఖాసీ హిల్స్, అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) ఇవాన్ బి. డియెంగ్‌డో నేతృత్వంలో 26 మే 2025న  ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు, మూడు రోజుల్లోనే నిందితుడిని జోర్హాట్‌కు చెందిన హిమాన్ గొగోయ్‌గా గుర్తించి, మహిళా పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ (WPSI) లావినియా కొంగ్వాంగ్ నేతృత్వంలోని పోలీసు బృందం 29 మే 2025న అస్సాంలోని టియోక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బమ్కుకురాచువా గ్రామంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి లుమ్డియెంగ్‌జ్రీ పోలీస్ స్టేషన్ నమోదైన FIR కాపీని ఇక్కడ చూడవచ్చు.

తదుపరి మేము ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తూర్పు ఖాసీ హిల్స్ పోలీసులను సంప్రదించగా, తూర్పు ఖాసీ హిల్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (city), హెర్బర్ట్ పైనైద్ ఖార్కోంగోర్ మాతో (Factly) మాట్లాడుతూ, “ఈ సంఘటనలో నిందితుడు పేరు హిమాన్ గొగోయ్, అతను అస్సాంకు చెందినవాడు, అలాగే అతను ముస్లిం కాదు” అని చెప్పారు. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియోలో పాఠశాల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి ముస్లిం కాదని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, షిల్లాంగ్‌లో ఒక యువకుడు పాఠశాల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన దృశ్యాలను చూపిస్తున్న వీడియోను తప్పుడు మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు.