Fake News, Telugu
 

నాగ్‌పూర్‌లో డీజే సౌండ్ కారణంగా గోడ కూలిపోయిందని ఉత్తరప్రదేశ్‌లో ఓ గోడ కూలిన ఘటనకు సంబంధించిన వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు

0

“మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో డీజే (DJ)సౌండ్‌ల వల్ల ఏర్పడిన వైబ్రేషన్స్ కారణంగా ఓ గోడ కూలి ఫంక్షన్‌కు హాజరైన పలువురు గాయపడ్డారు” అంటూ వీడియోతో కూడిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఇలాంటిదే మరొక పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో డీజే (DJ) సౌండ్ల వల్ల ఏర్పడిన వైబ్రేషన్స్ కారణంగా ఓ గోడ కూలి ఫంక్షన్‌కు హాజరైన పలువురు గాయపడిన దృశ్యాలను చూపిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో నాగ్‌పూర్‌కు చెందినది కాదు. ఈ వైరల్ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లా ఘోసిలో ఓ గోడ కూలిన ఘటనకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. వార్త కథనాలు, మౌ పోలీసుల ప్రకారం, 08 డిసెంబర్ 2023న ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లా ఘోసిలో ఓ వివాహ ఊరేగింపుపై గోడ కూలి దాదాపు ఆరుగురు మరణించారు, పలువురు గాయపడ్డారు. డీజే శబ్దాల కారణంగా ఈ గోడ కూలిపోయిందని ఈ కథనాలలో ఎక్కడా పేర్కొనలేదు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను X (ట్విట్టర్)లో షేర్ చేస్తూ, ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌కు చెందినదని పలువురు పేర్కొన్నారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) (ఆర్కైవ్డ్ వైర్షన్స్ ఇక్కడ & ఇక్కడ).

ఈ సమాచారం ఆధారంగా తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, 08 డిసెంబర్ 2023న NDTV అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పబ్లిష్ అయిన న్యూస్ బులెటిన్ వీడియో ఒకటి లభించింది. ఈ వీడియోలోని దృశ్యాలను వైరల్ వీడియోతో పోల్చి చూస్తే, రెండు వీడియోలు ఒకే సంఘటనను చూపిస్తున్నాయని మనం నిర్ధారించవచ్చు. ఈ వార్తా కథనం ప్రకారం, ఈ ఘటన 08 డిసెంబర్ 2023న ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లా ఘోసిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 06 మంది చనిపోయారని ఈ కథనం పేర్కొంది.

ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, డిసెంబర్ 2023లో పబ్లిస్ అయిన పలు వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, 08 డిసెంబర్ 2023న ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లా ఘోసిలో ఓ వివాహ ఊరేగింపుపై గోడ కూలి దాదాపు ఆరుగురు మరణించారు మరియు పలువురు గాయపడ్డారు. డీజే శబ్దాలకు గోడ కూలిపోయిందని ఈ కథనాలలో ఎక్కడా పేర్కొనలేదు. ‘News18 UP Uttarakhand’ కథనం ప్రకారం, శిథిలావస్థలో గోడ పక్కనే భారీగా ఇసుక కుప్పలు ఉంచడం వల్ల గోడపై ఆ భారం పడి గోడ కుప్పకూలిందని పేర్కొంది.

ఈ కూలిన 10-అడుగుల ఎత్తు మరియు 15-అడుగుల పొడవైన గోడ మసబ్బూర్ హసన్(తసవ్వర్ హసన్‌) అనే వ్యక్తి సంబంధించిన ఖాళీ స్థలంలో ఉండగా, ఘోసీకి చెందిన గయాసుద్దీన్ అనే వ్యక్తి ఇసుకను ఆ గోడ పక్కనే ఉంచాడని. ఈ ఘటన తర్వాత పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని ‘Hindustan Times’ కథనం పేర్కొంది.

మౌ జిల్లా పోలీసులు వారి అధికారిక X(ట్విట్టర్)లో ఈ సంఘటనకు సంబంధించి మౌ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) యొక్క వీడియో బైట్‌ను షేర్ చేశారు. దీని ప్రకారం, 8 డిసెంబర్ 2023న, ఘోసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహ వేడుకకు సంబంధించి హల్దీలో పాల్గొని తిరిగి వస్తున్న మహిళలపై శిథిలావస్థలో ఉన్న గోడ కూలి నలుగురు మహిళలు మరియు ఇద్దరు పిల్లలు మరణించారు, ఈ ఘటనకు సంబంధించి ఘోసీ పోలీస్ స్టేషన్ FIR (0551/2023) నమోదు చేసి, ఈ ఘటనకు కారణమైన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ వీడియోలో కూడా డీజే సౌండ్స్ వల్ల ఈ ఘటన జరిగిందని పోలీసులు ఎక్కడా పేర్కొనలేదు.

తదుపరి మేము ఈ కేసుకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం వెతకగా, మౌ జిల్లా సెసన్స్ కోర్టులో ఈ కేసులో జరిగిన వాదనల కాపీని మేము కనుగొన్నాము. ఈ వాదనలలో కూడా ఎక్కడ డీజే సౌండ్స్ వాళ్ళ గోడ కూలినట్లు నిందుతుల తరఫు న్యాయవాదులు గానీ, ప్రభుత్వ న్యాయవాదులు గానీ ప్రస్తావించలేదు. దీన్ని బట్టి డీజే సౌండ్ కారణంగా ఈ గోడ కూలిపోలేదని మనం నిర్ధారించవచ్చు.  

చివరగా, నాగ్‌పూర్‌లో డీజే సౌండ్ కారణంగా గోడ కూలిపోయిందని ఉత్తరప్రదేశ్‌లో ఓ గోడ కూలిన ఘటనకు సంబంధించిన వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll