ఇండిగో విమానాల రద్దు కారణంగా హైదరాబాద్ విమానాశ్రయం దృశ్యాలు అని చెప్తూ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో తీసిన వీడియో షేర్ చేస్తున్నారు

డిసెంబర్ 2025లో ఇండిగో విమానాల రద్దు కారణంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై తదితర విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). భారీ రద్దుల కారణంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). 

ఈ నేపథ్యంలో, హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీని చూపిస్తున్న దృశ్యాలని చెప్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దిశ డైలీ, తెలుగు స్క్రైబ్, సుమన్ టీవీ వంటి మీడియా సంస్థలు కూడా ఈ వీడియోను హైదరాబాద్ విమానాశ్రయానికి చెందినది అని చెప్తూ తమ కథనాల్లో పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.   

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇండిగో విమానాల రద్దు కారణంగా హైదరాబాద్ విమానాశ్రయంలో ఏర్పడ్డ ప్రయాణికుల రద్దీని చూపిస్తున్న వీడియో.

ఫ్యాక్ట్(నిజం): బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-1 దగ్గర తీసిన వీడియో ఇది, హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాదు.  కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

ముందుగా ఒక కీవర్డ్ సెర్చ్ ద్వారా, ఇండిగో విమానాల రద్దు కారణంగా హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు అని చెప్తున్న అనేక విశ్వసనీయ వార్తా కథనాలు మాకు లభించాయి. ఈ వీడియో కథనాల్లో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) హైదరాబాద్ విమానాశ్రయంలో ఉన్న ప్రయాణికుల రద్దీని మనం (విమానాల కోసం వేచి చూస్తున్న వారిని) చూడవచ్చు.  

అయితే, వైరల్ వీడియో హైదరాబాద్ విమానాశ్రయానికి చెందినదని చెప్తూ మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లభించలేదు. వైరల్ వీడియోలో ఉన్న కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, మాకు ఇదే వీడియో ఉన్న కొన్ని వేరే పోస్టులు లభించాయి (ఇక్కడ, ఇక్కడ).

అయితే, ఈ క్రమంలో వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను పోలి ఉన్న ఒక ఫోటో మాకు ది హిందూ, ది వైర్ వారి వార్తా కథనాల్లో లభించింది (ఇక్కడ ,ఇక్కడ). ఇండిగో విమానాల రద్దు కారణంగా బెంగళూరులో ఉన్న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఒక కౌంటర్ దగ్గర చిక్కుకుపోయి ఉన్న ప్రయాణికులను చూపిస్తున్న ఫోటో అని దీని గురించి వారు రాశారు.

మనీకంట్రోల్ వారి ఒక సోషల్ మీడియా పోస్టులో, డెక్కన్ హెరాల్డ్, హిందుస్థాన్ టైమ్స్ తదితర మీడియా సంస్థల వారి వార్తా కథనాల్లో (ఇక్కడ, ఇక్కడ) కూడా ఇదే విమానాశ్రయాన్ని చూపిస్తున్న ఫోటోలు మాకు కనిపించాయి. ఇవి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI) వారి ఫోటోలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) వైరల్ వీడియోలో కనిపిస్తున్నటువంటి పిల్లర్లు, రెండు బోర్డులు మాకు ఈ ఫోటోల్లో కనిపించాయి. 

దీన్ని ఆధారంగా తీసుకొని మేము బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన 360 డిగ్రీ ఫోటోలను (ఫోటో sphere ఆప్షన్ ఉపయోగించి చూసాము) గూగుల్ మ్యాప్స్‌లో పరిశీలించాము. ఈ సెర్చ్ ద్వారా మాకు వైరల్ వీడియోను తీసిన ప్రదేశం లభించింది. ఇది బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన టెర్మినల్ 1(T1)లో ఉన్న చెక్-ఇన్ కౌంటర్‌ల దగ్గర తీశారు. వైరల్ వీడియోలో కనిపించే ఎస్కలేటర్, పిల్లర్లు, సైన్ బోర్డు, కౌంటర్లు అన్ని మనం ఈ ఫొటోలో చూడవచ్చు.

అదనంగా, విమాన చెక్-ఇన్ ప్రక్రియను చూపిస్తూ బెంగళూరు విమానాశ్రయంలో కొందరు వ్లాగర్లు చేసిన యూట్యూబ్ వీడియోలను మేము పరిశీలించగా, వైరల్ వీడియోను తీసింది అక్కడే అని మాకు స్పష్టం అయింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). అదనంగా, హైదరాబాద్ విమానాశ్రయంలో చెక్-ఇన్ కౌంటర్ల నుంచి సెక్యూరిటీ చెక్ ఇంకా డిపార్చర్ గేట్‌ల దగ్గరకు వెళ్లడానికి పైకి వెళ్లనవసరం లేదు, అవన్నీ ఒకే లెవెల్/అంతస్తులో లేదా కింద అంతస్తులో ఉంటాయి.

చివరగా, ఇండిగో విమానాల రద్దు కారణంగా హైదరాబాద్ విమానాశ్రయం దృశ్యాలు అని చెప్తూ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో తీసిన వీడియో షేర్ చేస్తున్నారు.