18 జూలై 2025న మేఘాలయలో జరిగిన ఒక యువతి హత్యకు సంబంధించిన వీడియోను తప్పుడు మతపరమైన కోణంతో షేర్ చేస్తున్నారు

పోలీసులు ఓ యువతి మృతదేహాన్ని స్ట్రెచర్‌పై పెడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఓ హిందూ అమ్మాయిని తన ముస్లిం బాయ్‌ఫ్రెండ్ గొడ్డలితో చంపేశాడు అంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒక ముస్లిం వ్యక్తి తన హిందూ ప్రియురాలిని గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటననకు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో మేఘాలయలోని ఈస్ట్ గారో హిల్స్ జిల్లా విలియంనగర్‌లో 18 జూలై 2025న జరిగిన హత్యకు సంబంధించినది. బాధితురాలి బాయ్‌ఫ్రెండ్ జేమ్స్ ఆర్. సంగ్మా, ఆమెను కలవడానికి పిలిచి, జనాల మధ్యలోనే గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదని, బాధితురాలు, నిందితుడు ఇద్దరూ గారో కమ్యూనిటీకి చెందినవారేనని, కేసు ప్రస్తుతం విచారణలో ఉందని, నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విలియంనగర్‌ ఎస్పీ స్టీఫెన్ ఏ. రింజా‌ స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ 19 జూలై 2025న మేఘాలయ మానిటర్ ప్రచురించిన వార్తా కథనం లభించింది. ఈ కథనం ప్రకారం, మేఘాలయలోని ఈస్ట్ గారో హిల్స్ జిల్లా విలియంనగర్‌లో ఉన్న దావా మచ్చకోల్గ్రే ప్రాంతానికి చెందిన 19 సంవత్సరాల యువతి 18 జూలై 2025న హత్యకు గురైంది.

ఈ సంఘటన గురించి మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, ఈ ఘటనకు సంబంధించిన పలు వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాలు ప్రకారం, ఈ ఘటన మేఘాలయలోని ఈస్ట్ గారో హిల్స్ జిల్లా విలియంనగర్‌లో ఉన్న సంగాంగ్ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో నిందితుడు బాధితురాలి బాయ్‌ఫ్రెండ్‌ జేమ్స్ ఆర్. సంగ్మా అని ఈ కథనాల పేర్కొన్నాయి. నిందితుడు ఆమెను కలవమని పిలిచి జనాల మధ్యలోనే గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయిన సంగ్మా కోసం సీనియర్ అధికారుల నేతృత్వంలో స్పెషల్ టీమ్ గాలింపు చేపట్టింది. మేఘాలయ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ సంఘటనను సుమోటోగా కేసుగా తీసుకుంది. ఈ కేసు సున్నితమైనదైన నేపథ్యంలో బాధితురాలి పేరు, వ్యక్తిగత వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ముఖ్యంగా, ఈ ఘటనలో మతపరమైన కోణం ఉందని ఎలాంటి పోలీసు ప్రకటనల్లోనూ లేదా మీడియా కథనాల్లోనూ ఎక్కడా ప్రస్తావించలేదు.

ఈ కేసులో మతపరమైన కోణం ఉందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు, మేము విలియంనగర్‌ ఎస్పీ స్టీఫెన్ ఏ. రింజా‌ను సంప్రదించాము. వైరల్ వీడియో మేఘాలయలోని విలియంనగర్‌లో 18 జూలై 2025న జరిగిన హత్యకు సంబంధించింది అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదని, బాధితురాల నిందితుడు ఇద్దరూ గారో కమ్యూనిటీకి చెందినవారేనని, కేసు ప్రస్తుతం విచారణలో ఉందని, నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

చివరిగా, 18 జూలై 2025న మేఘాలయలో జరిగిన ఒక యువతి హత్యకు సంబంధించిన వీడియోను తప్పుడు మతపరమైన కోణంతో షేర్ చేస్తున్నారు.