వక్ఫ్ సవరణ చట్టం, 2025ని వ్యతిరేకిస్తూ, ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్‌లో చాలా చోట్ల నిరసనలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ ఆందోళనులు హింసాత్మకంగా మారి, గొడవలు, అల్లర్లు కూడా జరిగాయని వార్తా కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ కథనాల ప్రకారం( ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), ముర్షిదాబాద్‌లో జరిగిన గొడవల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, ఇందులో చందన్ దాస్, హరగోబింద్ దాస్ అనే ఇద్దరు హిందువులు ఒక మూక దాడిలో మరణించగా, ఒక ముస్లిం వ్యక్తి పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. ముర్షిదాబాద్ జిల్లాలో జరుగుతున్న ఈ హింసను తప్పించుకోవడానికి వందలాది హిందువులు తమ ఇళ్లను వదిలి, ఆశ్రయం పొందడానికి మాల్డా నగరానికి చేరుకున్నారని కూడా మీడియా రిపోర్ట్ చేసింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ముర్షిదాబాద్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర బలగాలని మోహరించాలని కలకత్తా హైకోర్టు 12 ఏప్రిల్ 2025న ఆదేశించింది (ఇక్కడ, ఇక్కడ). ఈ అల్లర్లకు సంబంధించి 150 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ).
ఈ అల్లర్ల నేపథ్యంలో, “పశ్చిమ బెంగాల్‌లో జరిగిన అల్లర్లలో ఒక హిందూ దళిత మహిళ ఇల్లు సహా మొత్తం దళిత (SC) కాలనీని తగలబెట్టారు, దహనం చేయబోయే ముందు ఇళ్ళు మొత్తం లూటీ చేశారు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ పోస్టుకు మద్దతుగా, కాలిపోతున్న ఇళ్లను చూపిస్తున్న దృశ్యాలను, ఓ మీడియా ఛానెల్‌తో మహిళలు ఏడుస్తూ బెంగాలీ భాషలో మాట్లాడుతున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టం, 2025ని వ్యతిరేకిస్తూ జరిగిన అల్లర్లలో ఒక హిందూ దళిత మహిళ ఇల్లు సహా మొత్తం దళిత (SC) కాలనీని అల్లరిమూకలు తగలబెట్టగా, బాధిత మహిళ మీడియాతో మాట్లాడుతున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోకు, పశ్చిమ బెంగాల్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో 15 ఏప్రిల్ 2025న బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నగరంలోని ఒక మురికివాడలో జరిగిన అగ్నిప్రమాద సంఘటనకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల జరిగిన అల్లర్లలో హిందూ కుటుంబాలకు చెందిన వ్యాపారాలు, దుకాణాలు, ఇళ్ళు ధ్వంసం అయ్యాయని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. రిపోర్ట్స్ ప్రకారం, పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన అల్లర్లకు భయపడి వందలాది ప్రజలు, ముఖ్యంగా హిందువులు, స్థానిక భాగీరథి నదిని దాటి పొరుగున ఉన్న మాల్దా జిల్లాలో ఆశ్రయం పొందుతున్నారు. కానీ, వైరల్ వీడియోకు పశ్చిమ బెంగాల్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఈ కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను (ఆర్కైవ్డ్ లింక్) ‘SOMOY TV’ అనే బంగ్లాదేశ్ మీడియా సంస్థ వారి అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 15 ఏప్రిల్ 2025న షేర్ చేసినట్లు కనుగొన్నాము. ఈ వీడియో ప్రకారం, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ (చట్టోగ్రామ్) నగరంలోని ఒక మురికివాడలో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలను, భాదిత మహిళలు మీడియాతో మాట్లాడుతున్న దృశ్యాలను వైరల్ వీడియో చూపిస్తుంది. (బంగ్లాదేశ్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన చిట్టగాంగ్ (Chittagong) యొక్క ఆంగ్ల స్పెల్లింగ్ 2018లో చట్టోగ్రామ్‌గా (Chattogram) మార్చబడింది (ఇక్కడ, ఇక్కడ).
వైరల్ వీడియోలోని పలు దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ పలు బంగ్లాదేశ్ మీడియా సంస్థలు యూట్యూబ్‌లో షేర్ చేసిన మరిన్ని వీడియో కథనాలను ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, పలు బంగ్లాదేశ్ మీడియా సంస్థలు ప్రచురించిన వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, 15 ఏప్రిల్ 2025 తెల్లవారుజామున చిట్టగాంగ్ లోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిఆర్‌బి మాలిపారా మురికివాడలో జరిగిన ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 20 మురికివాడల ఇళ్లు దగ్ధమయ్యాయి. చటోగ్రామ్ ఫైర్ సర్వీస్ & సివిల్ డిఫెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అన్వర్ హుస్సేన్ ప్రకారం ఉదయం 5:30 గంటలకు ఈ మంటలు ప్రారంభమయ్యాయి. సమాచారం అందగానే ఐదు అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని సుమారు 2 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయని, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు, కానీ Tk16 లక్షల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి అని అన్వర్ హుస్సేన్ మీడియాతో చెప్పారు.
చివరగా, ఈ వైరల్ వీడియో 15 ఏప్రిల్ 2025న బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నగరంలో జరిగిన అగ్నిప్రమాద సంఘటనకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది.