ఇటీవల జరిగిన 2024 లోక్ సభ ఎన్నికల్లో EVMల ట్యాంపరింగ్ జరిగిందంటూ పలు పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో అమెరికా నుండి భారత్‌లోని EVMలను ట్యాంపర్ చేస్తున్నట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి పలు EVMలలోని ఓట్ల సంఖ్యను ట్యాంపర్ చేసినట్టు ఉంటుంది (ఇక్కడ & ఇక్కడ). ఈ వీడియో ఇటీవల జరిగిన ఎన్నికలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల జరిగిన 2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించి అమెరికా నుండి భారత్‌లోని EVMలను ట్యాంపర్ చేస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో ఉన్నది ‘సయ్యద్ షుజా’ అనే స్వయం ప్రకటిత సైబర్ ఎక్స్‌పర్ట్. ప్రస్తుతం షేర్ అవుతున్న ఈ వీడియో EVMలను హ్యాక్ చేయవచ్చని వాదిస్తూ 2019లో రికార్డు చేసింది. ఈ వ్యక్తి అంతకుముందు నుండి కూడా EVMలను హ్యాక్ చేయవచ్చని వాదిస్తున్నాడు. 2019లో ఎన్నికలకు ముందు ఇతను చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో ECI ఇతను చేసిన ఆరోపణలను ఖండిస్తూ, ఇతనిపై ఢిల్లీలో కేసు రిజిస్టర్ చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టిస్తుంది.
అమెరికాలో నుండి భారత్ లోని EVMలను ట్యాంపర్ చేస్తున్నట్టు ఉన్న వీడియో ఇప్పటిది కాదు. ఈ వీడియో 2019 ఎన్నికల నుండే ఉంది. ప్రస్తుతం షేర్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించి సమాచారం కోసం ఫేస్‌బుక్‌లో వెతకగా ఈ వీడియోలో వ్యక్తి యొక్క పేజీ మాకు కనిపించింది.
ఫేస్‌బుక్ పేజీలో అందించిన సమాచారం ప్రకారం ఇతని పేరు ‘సయ్యద్ షుజా’, అమెరికాలో ఉంటున్న భారతీయుడు. ఇతను ఒక స్వయం ప్రకటిత సైబర్ ఎక్స్‌పర్ట్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వాడిన ఈవీఎంలను అభివృద్ధి చేసిన ECIL బృందంలో తాను కూడా సభ్యుడినని ప్రకటించాడు. ప్రస్తుతం షర్ అవుతున్న వీడియోను ఇతను ఫేస్‌బుక్ ద్వారా 26 సెప్టెంబర్ 2019న లైవ్ స్ట్రీమ్ చేసాడు. అంతకు ముందు నుండే EVMలను ట్యాంపర్ చేయవచ్చని, తానూ ఇది నిరూపించగలనని, 2014 నుండి BJP ఎన్నికల్లో EVMలను ట్యాంపర్ చేసే గెలుస్తుందని వాదిస్తూ ఉన్నాడు (ఇక్కడ & ఇక్కడ).
ఈ సమాచారం ఆధారంగా ఇంటర్నెట్‌లో వెతకగా ఇతనికి సంబంధించి అనేక వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం జనవరి 2019లో లండన్‌లో మీడియా సమావేశంలో అమెరికా నుంచి స్కైప్ ద్వారా మాట్లాడిన సయ్యద్ షుజా EVMలను ట్యాంపరింగ్ చేయొచ్చని, 2014 సార్వత్రిక ఎన్నికల్లో EVMలను హ్యాక్ చేశారని, రిగ్గింగ్‌తోనే BJP గెలిచిందని ఆరోపణలు చేశాడు. ఆ టైంలో సయ్యద్ చేసిన ఆరోపణలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది.
ఐతే సయ్యద్ ఆరోపణలపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. EVMలను హ్యాక్ చేయవచ్చని చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఒక సర్కులర్ విడుదల చేసింది. సయ్యద్ ఆరోపిస్తున్నట్టు EVMలను వైర్లెస్ ద్వారా హ్యాక్ చేయడం సాధ్యం కాదని తెలిపింది. ఈ ఆరోపణలు చేసిన సయ్యద్ షుజాపై IPC 505(1)(b) సెక్షన్ కింద FIR నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను కోరింది. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసులకు లేఖ కూడా రాసింది. ఢిల్లీ పోలీసులు కూడా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సయ్యద్ షుజాపై FIR రిజిస్టర్ చేసినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేశాయి.
ఇదిలా ఉండగా సయ్యద్ షుజా ఆరోపణలపై ECIL స్పందించింది. ‘సయ్యద్ షుజా’ ఎవరో తెలియదని, అలాంటి పేరు కలిగిన వ్యక్తి ECILలో అసలు పనిచేయలేదని ప్రకటించింది. కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగిగా కూడా పనిచేయలేదని స్పష్టంచేసింది. రికార్డులన్నింటినీ పరిశీలించిన అనంతరం ఇదే విషయాన్ని కేంద్రం ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.
ఈ క్రమంలో గమనించాల్సిన విషయం ఏంటంటే ‘సయ్యద్ షుజా’ అమెరికాలో 2018 నుండి ‘సయ్యద్ హైదర్ అహ్మద్’ పేరుతో రాజకీయ ఆశ్రయం పొందుతున్నాడని కొన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఐతే ఇతను ఇటీవల జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆరోపణలు చేసినట్టు రిపోర్ట్స్ ఐతే లేవు .
చివరగా, EVMలను హ్యాక్ చేయవచ్చని వాదిస్తూ 2019లో ‘సయ్యద్ షుజా’ అనే స్వయం ప్రకటిత సైబర్ ఎక్స్‌పర్ట్ రికార్డు చేసిన వీడియోను ఇటీవల జరిగిన 2024 లోక్ సభ ఎన్నికలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.