సంత్ రాంపాల్ దాస్ రచించిన ‘గీత నీ జ్ఞాన అమృతం’ పుస్తకాన్ని విక్రయిస్తున్న వీడియోను తప్పుడు మతపరమైన వాదనతో షేర్ చేస్తున్నారు

“ముస్లింలు నకిలీ గీత (భగవద్గీత) రాసి హిందువులకు పంచుతున్నారు, గీతాలో ఖురాన్ గొప్పదని ఎక్కడుంది” అని చెప్తూ ఓ వీడియోతో కూడిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో ఓ యువకుడు ‘గీత నీ జ్ఞాన అమృతం’ అనే పుస్తకాన్ని అమ్ముతుండగా, నకిలీ భగవద్గీత పుస్తకాలను అమ్ముతున్నాడని కొందరు అతనితో వాగ్వాదానికి దిగడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ముస్లింలు నకిలీ గీత (భగవద్గీత) రాసి హిందువులకు పంచుతున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో కనీసం ఏప్రిల్ 2023 నుండి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ “గీత నీ జ్ఞాన అమృతం” అనే పుస్తకం రచయత ముస్లిం కాదు, ఈ పుస్తకాన్ని దైవజనుడు (స్వయం ప్రకటిత దేవుడు) సంత్ రాంపాల్ దాస్ రచించాడు. భగవద్గీత నుండి అవసరాన్ని బట్టి వివరణలు తీసుకుని ఈ పుస్తకాన్ని రచించారని ఈ పుస్తక పరిచయం (భూమిక)లో పేర్కొన్నారు. అలాగే, ఈ పుస్తకంలో సంత్ రాంపాల్ దాస్ క్రైస్తవం మరియు ఇస్లాం వంటి ఇతర మతాల గురించి తన అభిప్రాయాలను రాశాడు. ఈ కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వీడియోను నిశితంగా పరిశీలిస్తే, ఈ వీడియోలో యువకుడు విక్రయిస్తున్న పుస్తకం యొక్క పేరు ‘గీత నీ జ్ఞాన అమృతం’ అని, అలాగే ఈ పుస్తకంలో సంత్ రాంపాల్ దాస్ రచయితగా(సంత్ రాంపాల్ దాస్ యొక్క శిష్యుడు స్వామి రామ్ దేవానంద్ ఈ పుస్తకంను లిఖించినట్లు) పేర్కొనడం మనం గమించవచ్చు. దీని ఆధారంగా, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, స్వయం ప్రకటిత దేవుడు సంత్ రాంపాల్ దాస్ (అలియాస్ రాంపాల్ జీ మహారాజ్, జగత్ గురు రాంపాల్ జీ) సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో (ఆర్కైవ్డ్) ఈ పుస్తకం అందుబాటులో ఉందని కనుగొన్నాము. ఇదే పుస్తకం వివిధ భాషలలో ఉన్నట్లు ఈ వెబ్‌సైట్‌లో మనం చూడవచ్చు. ఇదే ‘గీత నీ జ్ఞాన అమృతం’ పుస్తకం amazon వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉందని మేము కనుగొన్నాము. ‘The Knowledge Of Gita Is Nectar’ అనే పేరుతో ఇదే పుస్తకం యొక్క ఇంగ్లీష్ భాషలో ఉంది. అలాగే ఇదే వీడియో ఇలాంటి వాదనతోనే  ఏప్రిల్ 2023 నుండి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది అని మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ).

పుస్తకం యొక్క పరిచయం(భూమిక)లో, “గీతా(భగవద్గీత) శాస్త్రములో మొత్తం 18 (పద్దెనిమిది) అధ్యాయంలు మరియు 700 (ఏడు వందలు) శ్లోకములు కలవు. నేను పవిత్ర పుస్తకం(భగవద్గీత) నుండి ఆవశక్యత అనుసారం వివరణలని తీసుకుని గ్రంథం “గీతా నీ జ్ఞాన అమృతం” యొక్క రచనా చేసితిని. ఎలా అంటే అడవిలో ఔషధులు ఉంటాయి. వైద్యుడు ఆ వనం నుండి ఆవశ్యక ఔషధులని తీసుకుంటాడు. దానిచేత జీవింపచేయు ఔషధులని తయారుచేసుకుంటాడు. వనం అయిన కూడ విద్యామానమై ఉంటుంది” అని పేర్కొన్నారు.

అలాగే, ఈ పుస్తకంలో దైవజనుడు (స్వయం ప్రకటిత దేవుడు) సంత్ రాంపాల్ దాస్ క్రైస్తవం మరియు ఇస్లాం వంటి ఇతర మతాల గురించి తన అభిప్రాయాలను వ్రాయడం కూడా మనం గమనించవచ్చు. ఇదే పుస్తకం గురించి రాంపాల్ పేరు మీద పనిచేస్తున్న వెరిఫైడ్ X(ట్విట్టర్)హ్యాండిల్ 26 ఏప్రిల్ 2023న పోస్టు చేసింది.

దీన్ని బట్టి ఈ “గీత నీ జ్ఞాన అమృతం” అనే పుస్తకం రచయత ముస్లిం కాదని, దైవజనుడు (స్వయం ప్రకటిత దేవుడు) సంత్ రాంపాల్ దాస్ ఈ పుస్తకం రచించినట్లుగా మనం నిర్ధారించవచ్చు. సంత్ రాంపాల్ దాస్ గురించి మరింత సమాచారం ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.  

చివరగా, స్వయం ప్రకటిత దేవుడు సంత్ రాంపాల్ దాస్ రచించిన“ గీత నీ జ్ఞాన అమృతం” పుస్తకాన్ని విక్రయిస్తున్న వీడియోను మతపరమైన వాదనతో షేర్ చేస్తున్నారు.