దావోస్ పెట్టుబడుల విషయంలో 2022లో పవన్ కళ్యాణ్ వైకాపా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పటి వీడియోని 2025లో అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు

దావోస్‌లో జరుగుతున్న 2025 ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖా మంత్రి లోకేష్, ఇతర అధికారులు పాల్గొన్న నేపథ్యంలో, పెట్టుబడుల కోసం దావోస్ వెళ్లాల్సిన అవసరం లేదని, భారత్‌లో కూడా ప్రయత్నించొచ్చని ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారిని విమర్శించారని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

A screenshot of a video

AI-generated content may be incorrect.
ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: పెట్టుబడుల కోసం దావోస్ వెళ్లాల్సిన అవసరం లేదని 2025లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

ఫాక్ట్: ఇది జూన్ 2022 నాటి వీడియో. ఈ సమయంలో(2019-2024) అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా పవన్ కళ్యాణ్ 2025లో దావోస్ సదస్సు నేపథ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు ఏమైనా చేశారా అని ఇంటర్నెట్లో వెతకగా మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లభించలేదు. దీన్ని బట్టి వైరల్ వీడియో పాతది అయ్యుంటుందని భావించి “దావోస్” అని జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో వెతికగా, ఇదే వీడియోని 03 జూన్ 2022లో అప్లోడ్ (ఆర్కైవ్) చేసి ఉండడం గుర్తించాం. ఈ సమయంలో(2019-2024) ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.

పూర్తి వీడియోని పరిశీలించగా, 03 జూన్ 2022న మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాలో మాట్లాడుతున్న సమయంలో, దావోస్‌లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ₹1,25,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఒక విలేఖరి చెప్పగా, చేసుకున్న ఒప్పందాలు పెట్టుబడులుగా మారి ఉపాధి, ఉద్యోగాలు వచ్చినప్పుడు మాట్లాడుకుందామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అదానీ, అరబిందో లాంటి కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందు వచ్చాయని చెప్పగా, వీటికోసం దావోస్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదని, హైదరాబాద్, ఢిల్లీ లేదా విజయవాడలో కూడా సమావేశం కావచ్చని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మే 2022లో జరిగిన దావోస్ సదస్సులో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అదానీ, గ్రీన్కో, అరబిందో వంటి సంస్థలతో ₹1,25,000 కోట్ల పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటించారు.

పై ఆధారాలను బట్టి, వైరల్ వీడియోలో పవన్ కళ్యాణ్ 2022లో అప్పటి వైకాపా ప్రభుత్వాన్ని(2019-2024) విమర్శించారని స్పష్టమవుతుంది.

చివరైగా, దావోస్ పెట్టుబడుల విషయంలో 2022లో పవన్ కళ్యాణ్ వైకాపా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పటి వీడియోని 2025లో అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.