బంగ్లాదేశ్‌లోని ఒక మదర్సా విద్యార్థినులు పరీక్షల్లో ఫెయిల్ అయిన తర్వాత తమ టీచర్‌ను కొడుతున్న దృశ్యాలు అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చేయబడుతోంది. ఈ వీడియోలో, బురఖా ధరించిన కొందరు మహిళలు, కొంతమంది పురుషులను కొడుతున్నట్లు మనం చూడవచ్చు. ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: బంగ్లాదేశ్‌లోని ఒక మదర్సాలో కొందరు మహిళా విద్యార్థులు పరీక్షలలో ఫెయిల్ అయిన తర్వాత తమ టీచర్‌ను కొడుతున్న వీడియో.
ఫ్యాక్ట్ (నిజం): బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్‌లోని చకారియా మునిసిపాలిటీలో ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థ అయిన చకారియా కేంబ్రియన్ హైస్కూల్‌లో జరిగిన సంఘటనను ఈ వీడియో చూపిస్తుంది. బంగ్లాదేశీ వార్తా కథనాల ప్రకారం, ఈ పాఠశాల ప్రిన్సిపాల్ జహీరుల్ ఇస్లాం ఒక 10వ తరగతి విద్యార్థినితో తరగతి గదిలో అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీనితో జహీరుల్ ఇస్లాం, పాఠశాల ఉపాధ్యాయుల ప్రతినిధి యూనస్ విద్యార్థులను వేధించారని ఆరోపిస్తూ, విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసనలకు దిగారు. ఈ సందర్భంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కొందరు ప్రజలు పాఠశాల లోపల ఉపాధ్యాయులపై దాడి చేస్తున్నప్పుడు తీసిన వీడియో ఇది. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను వెరిఫై చేయడానికి, మేము వైరల్ వీడియోలోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్‌నెట్‌లో ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా ఫేస్‌బుక్‌లో కుమిల్లా న్యూస్ వారు అప్‌లోడ్ చేసిన దీని అసలు వీడియో మాకు లభించింది. వారు ఈ వీడియోను 10 జూలై 2025న అప్లోడ్ చేస్తూ, బంగ్లా భాషలో ‘చకారియాలోని కేంబ్రియన్ హై స్కూల్‌లో ఉపాధ్యాయుడు యూనస్‌పై దాడి’ అనే శీర్షికతో పోస్ట్ చేశారు.
దీనిని సూచనగా తీసుకొని, మేము ఇంటర్నెట్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా, ఈ వీడియోకు సంబంధించిన బంగ్లాదేశీ వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. ఈ వార్తా కథనాల ప్రకారం, కాక్స్ బజార్‌లోని చకారియా ఉపజిల్లాలో ఉన్న ఈ చకారియా కాంబ్రియన్ హై స్కూల్ ప్రిన్సిపాల్ జహీరుల్ ఇస్లాం, ఉపాధ్యాయుల ప్రతినిధి యూనస్ విద్యార్థులను వేధించారని ఆరోపణలు ఉన్నాయి.
12 జూలై 2025న దైనిక్ శక్ష ప్రచురించిన ఒక వార్తా కథనం ప్రకారం, ‘8 జూలైన, కోచింగ్‌కు వెళ్లడం లేదనే నెపంతో, పాఠశాల ప్రిన్సిపాల్ పాఠశాల గదిలోకి ప్రవేశించి, 10వ తరగతి విద్యార్థిని జేబులో డబ్బు ఉందా అని అడిగి, ఆమె పాఠశాల యూనిఫాం జేబులో చేయి వేసి, ఆమెను అనుచితంగా తాకి, ఆమెను ఆటపట్టించారని బాధితులు ఆరోపించారు.’ అతను ఈ ఆరోపణలను ఖండిస్తూ, దీని వెనుక కొందరు ఉపాధ్యాయులు హస్తం ఉందని పేర్కొన్నాడు. ఇక ఈ విషయంపై స్కూల్ విద్యార్థులు, ఉపజిల్లా నిర్బాహి ఆఫీసర్ (UNO)కు ఒక కంప్లైంట్ ఇచ్చారాని వార్తా కథనాలు పేర్కొన్నాయి.
ఈ విషయంలో, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు 10 జూలై 2025న పాఠశాల ముందు రోడ్డును అడ్డుకుని మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఈ నిరసనలో, జహిరుల్ ఇస్లాం, పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ రాజీనామా చెయ్యలని కోరారు. ఆ తర్వాత, అక్కడ ఉన్న తల్లిదండ్రులు, కొందరు ప్రజలు వారిపై దాడి చేశారు.
ఈ సంఘటనకు సంబంధించిన వార్తా కథనాలలో ఎక్కడా కూడా ఈ వీడియో, పాఠశాల బాలికలు పరీక్షలలో ఫెయిల్ కావడంతో వారు తమ ఉపాధ్యాయుడిను కొడుతున్న దృశ్యాలని ప్రస్తావించలేదు. ఇది ఒక విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించి, తప్పుగా పట్టుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ జహీరుల్ ఇస్లాంపై నిరనస నేపథ్యంలో జరిగిన సంఘటన.
అలాగే, ఆ పాఠశాల ఒక ప్రైవేటు సంస్థ అని, వార్తా కథనాలు పేర్కొన్నాయి, వైరల్ వీడియోలో చెప్తున్నట్టుగా మదర్సా కారు. మేము Google Mapsలో ఈ పాఠశాలను జియో లొకేట్ చేసి చూడగా, ఇది నిజంగానే కాక్స్ బజార్‌లోని చకారియాలో ఉందని మాకు తెలిసింది.
ఈ నిరసనను చూపిస్తున్న ఒక YouTube వీడియోలో కనిపించే భవనంతో పాఠశాల భవనం మ్యాచ్ అవుతుంది. పాఠశాల బోర్డుపై కూడా ఎక్కడ ఇది మదర్సా అని చెప్పలేదు. అలాగే, వారి అధికారిక ఫేస్‌బుక్ పేజీ, పాఠశాల వెబ్‌సైట్‌లో కూడా, ఇది మదర్సా అని ప్రస్తావించబడలేదు.
సంఘటన తర్వాత, చకారియా కాంబ్రియన్ హై స్కూల్ ఉపాధ్యాయ ప్రతినిధి యూనస్, పాఠశాల అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతున్న కొన్ని వీడియోలను (ఇక్కడ, ఇక్కడ) ఈ పాఠశాల వారు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. వైరల్ వీడియోలో తన్నులు తింటున్న ఉపాధ్యాయుడు యూనస్ మనకి ఈ వీడియోలలో కనిపిస్తాడు. ఇందులో వారు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి, మేము ఈ వీడియోలను Google యొక్క నోట్‌బుక్ LLMలో అప్లోడ్ చేసి ట్రాన్స్క్రిప్ట్ పొందాము.
దాని ఆంగ్ల అనువాదాన్ని మేము నిశితంగా పరిశీలించిన తర్వాత, వారు ప్రిన్సిపాల్ జహీరుల్ ఇస్లాం పై ఉన్న ఆరోపణ గురించి మాట్లాడుతున్నారని, పరీక్షల్లో ఫెయిల్ అయిన బాలికల గురించి కాదని మాకు అర్థమైంది. ఈ స్కూల్ వారు 15 జూలై 2025న చేసిన ఓక ఫేస్‌బుక్ పోస్టులో ఒక కమిటీ ఈ సంఘటనపై విచారణ జరుపుతుంది అని పేర్కొన్నారు.
అదనంగా, పరీక్షలలో ఫెయిల్ అయిన తర్వాత మదర్సా విద్యార్థులు తమ టీచర్‌పై దాడి చేసిన సంఘటన ఇటీవల బంగ్లాదేశ్‌లో ఏదైనా జరిగిందా అని చూడడానికి మేము ఆన్‌లైన్‌లో కీవర్డ్ సెర్చ్ కూడా చేసాము. ఈ సెర్చ్ ద్వారా ఈ క్లెయిమ్‌ను ధృవీకరించే ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు మాకు దొరకలేదు.
అయితే, ఈ పాఠశాలలోని బాలికలు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారా లేదా అని మేము స్వతంత్రంగా ధృవీకరించలేకపోయాము, కానీ పైన పేర్కొన్న ఆధారాలను బట్టి ఈ వీడియో, వైరల్ క్లెయిమ్‌లో చెప్తున్నట్లు మదర్సాలోని బాలికలు పరీక్షలలో ఫెయిల్ అయిన తర్వాత తమ టీచర్‌ను కొడుతున్న సంఘటనకు చెందినది కాదని స్పష్టం అవుతుంది.
చివరగా, బంగ్లాదేశ్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడి మీద జరిగిన దాడి వీడియోను, పరీక్షల్లో ఫెయిల్ అయిన తర్వాత మదర్సా బాలికలు తమ టీచర్‌ను కొడుతున్న వీడియో అని షేర్ చేస్తున్నారు.