కంబోడియాలో కార్లను రవాణా చేస్తున్న రైలు వీడియోను ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగినట్టు షేర్ చేస్తున్నారు

ఒక పక్క స్థానికులు చేపలు పడుతుంటే మరోపక్క రైలులో రవాణా అవుతున్న కార్ల వీడియోను షేర్ చేస్తూ, ఆంధ్ర ప్రదేశ్‌లో రైళ్లో కియా కార్ల రవాణా చేయబడిందని రాస్తున్నారు. దీని వెనుక ఉన్న వాస్తవమేంటో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఆంధ్ర ప్రదేశ్‌లో రైలులో కియా కార్ల రవాణా చేస్తున్నప్పుడు తీసిన వీడియో

ఫాక్ట్(నిజం): ఈ ఘటన 2022లో కంబోడియాలో జరిగింది. వీడియోలో కనిపించే రైలు కంబోడియాకు చెందిన రాయల్ రైల్వే రైలు, ఇది ఫోర్డ్ ఎవరెస్ట్ మరియు ఫోర్డ్ పికప్ ట్రక్కులను Poi Pet నుండి Phnom Penh కు రవాణా చేస్తోంది. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ వీడియో గురించి తెలుసుకోవటానికి కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఇటువంటి వీడియో ఒకటి  కంబోడియా లైఫ్స్టైల్ అనే యూట్యూబ్ ఛానెల్లో “Modern cars were transported by​ old​ train​ in​ Cambodia,​ From​ Poiet​ to​ Phnom Penh” అనే టైటిల్‌తో 2022లో అప్లోడ్ చేసినట్టు గమనించాం.

దీని ఆధారంగా ఇంటర్నెట్లో వెతికితే, ఈ ఘటన గురించి Cartoq అనే ఆటో న్యూస్ వెబ్సైటు, వైరల్ వీడియోను షేర్ చేసిన X పోస్టును సూచిస్తూ ఆర్టికల్స్ ప్రచురించడం గమనించాం (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ ఘటన 2022లో కంబోడియాలో జరిగింది. వీడియోలో కనిపించే రైలు కంబోడియాకు చెందిన రాయల్ రైల్వే రైలు మరియు ఇది ఫోర్డ్ ఎవరెస్ట్ (ఫోర్డ్ ఎండీవర్) మరియు ఫోర్డ్ పికప్ ట్రక్కులను Poi Pet  నుండి Phnom Penh కు రవాణా చేస్తోంది అని తెలిసింది.

రాయల్ రైల్వే కంబోడియా యొక్క ఫేస్ బుక్ పేజీలో కార్లను రవాణా చేస్తున్న పలు రైలు వీడియోలు పోస్టు చేయటం గమనించాం (ఇక్కడ మరియు ఇక్కడ). పైగా, వైరల్ వీడియోలో ఉన్న రైలు పై  రాయల్ రైల్వే అని రాసి ఉండటం గమనించవచ్చు.

చివరిగా, కంబోడియాలో కార్లను రవాణా చేస్తున్న రైలు వీడియోను ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగినట్టు షేర్ చేస్తున్నారు.