న్యూయార్క్‌లో ముస్లింల ర్యాలీకి సంబంధించిన దృశ్యాలంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘ఇండియాలో IT ఉద్యోగాలు చూసుకోండమ్మా! న్యూయార్క్ అవసరమా?’’ అంటూ కొంతమంది ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన ముస్లింల ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): వైరల్ వీడియో న్యూయార్క్‌కి సంబంధించినది కాదు. ఈ వీడియో ముహమ్మద్ ప్రవక్త మనవరాలు లేడీ జైనాబ్ అల్ కుబ్రా వార్షిక అంత్యక్రియల సందర్భంగా ఇరాక్‌లోని అల్-గజాలియాలో జరిగిన ర్యాలీకి సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలతో జనవరి 2025లో పోస్ట్ చేయబడిన పలు సోషల్ మీడియా పోస్టులు మాకు లభించాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ పోస్ట్‌ల కామెంట్స్ సెక్షన్‌ను పరిశీలించినప్పుడు, కొందరు ఈ వీడియో ముహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన ర్యాలీలో తీసినట్లు పేర్కొన్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, ఈ కార్యక్రమంలో స్టేజ్‌పై కనిపించిన వ్యక్తి Hussein Wali Al Lami అనే పేరు గల ఇరాక్ షియా మతపరమైన పాటల పాడే గాయకుడు(eulogist) అని తెలిసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు అతను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేశాడు (ఇక్కడ & ఇక్కడ). అతను షేర్ చేసిన పోస్ట్‌ల వివరాల ప్రకారం, ఇది ముహమ్మద్ ప్రవక్త మనవరాలు లేడీ జైనాబ్ అల్ కుబ్రా వార్షిక అంత్యక్రియల సందర్భంగా ఇరాక్‌లోని అల్-గజాలియాలో జరిగిన ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు అని మాకు తెలిసింది.
వీడియో వివరణలో పేర్కొన్న లొకేషన్ موكب حامل اللواء (عليه السلام) ఆధారంగా మేము ఆ చోటును జియోలొకేట్ చేశాము. దీంతో ఈ వైరల్ వీడియో ఇరాక్‌లో చిత్రీకరించబడిందని తెలిసింది. గూగుల్ ఫోటోస్‌లో అప్‌లోడ్ చేయబడిన పలు ఫోటోలు కూడా ఈ వైరల్ వీడియోలో కనిపించిన దృశ్యాలతో సరి సరిపోలుతున్నాయి.
ఈ కార్యక్రమాన్ని అంత్యక్రియల ర్యాలీలు, మతపరమైన సమావేశాలను నిర్వహించే Mawkib Hamel Al-Lewa అనే గ్రూప్, ముహమ్మద్ ప్రవక్త మనవరాలు లేడీ జైనబ్ అల్ కుబ్రా వార్షిక అంత్యక్రియల సందర్భంగా ఏర్పాటు చేసినట్టు మాకు తెలిసింది. ఈ గ్రూప్ ప్రతి ఏడాది ఇదే ర్యాలీని నిర్వహిస్తూ వస్తోందని మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ).
చివరగా, ఇరాక్ లో జరిగిన ఓ మతపరమైన ర్యాలీ వీడియోను న్యూయార్క్‌కు ముడిపెడుతూ తప్పుగా షేర్ చేస్తున్నారు.