బిహార్‌లో ఇటుకలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను పోలీసు వాహనం ఢీకొట్టిన సంఘటనకు సంబంధించిన వీడియోను ఉత్తరప్రదేశ్‌కు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

ఉత్తరప్రదేశ్‌లో ఒక మూక పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లో ఒక మూక పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): వైరల్ వీడియో ఉత్తరప్రదేశ్‌కి సంబంధించినది కాదు. ఈ వీడియో బీహార్‌కు  సంబంధించినది. వీడియోలో కనిపిస్తున్న పోలీస్ వాహనంపై ‘బీహార్ పోలీస్’ అని రాసి ఉండటం మనం చూడవచ్చు. 11 జూన్ 2025న బీహార్‌లోని పూర్ణియా జిల్లాలోని బేలౌరీ-సోనౌలి రోడ్డుపై ఒక పోలిస్ వాహనం ఇటుకలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు. దీంతో  ఆగ్రహించిన స్థానికులు పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేసి, పోలీసులపై దాడి చేశారని వార్తా కథనాలు పేర్కొన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ వీడియోను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, పోలీసు వాహనంపై “బీహార్ పోలీస్” అని రాసి ఉండటం మేము గమనించాము. దీని ఆధారంగా ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌ కి సంబంధించినది కాదని, బీహార్‌కు సంబంధించినది కావచ్చని మేము అనుమానించాము.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను కలిగి ఉన్న పలు సోషల్ మీడియా పోస్ట్‌లను మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ ఘటన బీహార్‌లోని పూర్ణియాలో జరిగిందని ఈ పోస్టులు పేర్కొన్నాయి.

దీన్ని ఆధారంగా, ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, ఇదే సంఘటనను మరో కోణం నుంచి చూపించే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ జూన్ 2025లో వెలువడిన పలు వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాల ప్రకారం, ఈ ఘటన బీహార్‌లోని పూర్ణియా జిల్లా, ముఫస్సిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేలౌరీ-సోనౌలి రోడ్డుపై ఉన్న మంజెహ్లీ ప్రాంతంలోని IBC గోడౌన్‌ వద్ద జరిగింది.

వైరల్ వీడియోలోని దృశ్యాలను ఈ వార్త కథనాల్లో ఉన్న దృశ్యాలతో పోల్చగా, అవి ఒకే ప్రాంతాన్ని చూపిస్తున్నట్లు తేలింది. ఈ పోలికను క్రింద చూడొచ్చు. 

ETV Bharat 11 జూన్ 2025న ప్రచురించిన కథనం ప్రకారం, బీహార్‌లోని పూర్ణియా జిల్లా బేలౌరీ-సోనౌలి మెయిన్ రోడ్డుపై డయల్ 112 పోలీసు వాహనం ఇటుకలతో నిండిన ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పోలీసులతో పాటు నలుగురు గాయపడ్డారు. ప్రమాదం తర్వాత కోపంతో ఉన్న స్థానికులు పోలీస్ వాహనాన్ని రాళ్లతో ధ్వంసం చేశారు. అలాగే, వారు పోలీసులు భారీ వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు చేశారు. ముఫస్సిల్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, దోషులపై చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు. ఇదిలా ఉండగా, వేరే అక్రమ వసూళ్ల కేసులో పూర్ణియా ఎస్పీ కార్తికేయ శర్మ ఓ పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు.

చివరిగా, ఈ వీడియో బిహార్‌లో ఇటుకలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను పోలీసు వాహనం ఢీకొట్టిన తర్వాత ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితిని చూపిస్తుంది.