జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన తర్వాత ముస్లింలు న్యూయార్క్‌లో భారీ ర్యాలీ నిర్వహించారంటూ జూన్ 2025 నాటి మొహర్రం ర్యాలీ వీడియోను షేర్ చేస్తున్నారు

04 నవంబర్ 2025 న జరిగిన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి చెందిన 34 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆయన 01 జనవరి 2026న న్యూయార్క్ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ నేపథ్యంలో, జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన తర్వాత ముస్లింలు న్యూయార్క్‌లో భారీ ర్యాలీ నిర్వహించారని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన తర్వాత న్యూయార్క్‌లో ముస్లింలు నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో 30 జూన్ 2025న మొహర్రం సందర్భంగా న్యూయార్క్ నగరంలో ముస్లింలు నిర్వహించిన ‘ఆషురా’ ర్యాలీకి సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ ర్యాలీకి న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాబ్ మమ్దానీ ఎన్నికకు ఎటువంటి సంబంధం లేదు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దానీ 04 నవంబర్ 2025 న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆయన 01 జనవరి 2026న న్యూయార్క్ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా, వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన తర్వాత ముస్లింలు న్యూయార్క్‌లో భారీ ర్యాలీ నిర్వహించారా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ క్లెయింను సమర్థించే ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్ మాకు లభించలేదు.

తదుపరి, ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ర్యాలీకి సంబంధించిన దృశ్యాలను వేరే కోణంలో చూపిస్తున్న వీడియో ఒకటి లభించింది. ఈ వీడియోను ‘MechidTV’ అనే యూట్యూబ్ ఛానెల్‌ 30 జూన్ 2025న షేర్ చేసింది. ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ వైరల్ వీడియో 2025 మొహర్రం సందర్భంగా న్యూయార్క్ నగరంలో ముస్లింలు నిర్వహించిన ‘అషురా’ ర్యాలీ దృశ్యాలను చూపిస్తుంది. ఈ ర్యాలీకి సంబంధించిన మరిన్ని వీడియోలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

ఈ వీడియోలలో, వైరల్ వీడియోలో కనిపిస్తున్న అదే ప్రాంతాన్ని, భవనాలు, ట్రాఫిక్ సిగ్నల్‌లను మనం చూడవచ్చు. తదుపరి మేము ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న ప్రాంతాన్ని గూగుల్ మ్యాప్స్‌లో కూడా జియోలొకేట్ చేశాము. వైరల్ వీడియోలో కనిపిస్తుంది న్యూయార్క్ నగరంలోని పార్క్ ఏవ్ (పార్క్ అవెన్యూ) ప్రాంతం.

జోహ్రాబ్ మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా ఎన్నిక కావడానికి (04 నవంబర్ 2025) కంటే ముందు నుండే, అనగా 30 జూన్ 2025 నుంచే ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఉంది. దీన్ని బట్టి ఈ ర్యాలీకి న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాబ్ మమ్దానీ ఎన్నికకు ఎటువంటి సంబంధం లేదని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, ఈ వైరల్ వీడియో 30 జూన్ 2025న మొహర్రం సందర్భంగా న్యూయార్క్ నగరంలో ముస్లింలు నిర్వహించిన ‘ఆషురా’ ర్యాలీకి సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది.