హిందువుల్ని ఎలా చంపాలో ట్రైనింగ్ అవుతున్న యూపీకి చెందిన ఒక ముస్లిం వ్యక్తి వీడియో(ఇక్కడ, ఇక్కడ) అని చెప్పి ముస్లిం వేషధారణలో ఒకతను ఒక బొమ్మని కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: హిందువుల్ని ఎలా చంపాలో ట్రైనింగ్ అవుతున్న యూపీకి చెందిన ఒక ముస్లిం వ్యక్తి వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఒక మార్షల్ ఆర్టిస్ట్ మరియు మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. ఇతని పేరు మహమ్మద్ హస్సన్. ఇతను సోషల్ మీడియాలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ వీడియోస్ షేర్ చేస్తుంటాడు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
వైరల్ వీడియోని వెరిఫై చేస్తున్న ప్రక్రియలో, దానిపై @mohdhassan అనే వాటర్ మార్క్ ఉండటం మేము గమనించాం. ఈ అకౌంట్ కోసం మేము ఇంటర్నెట్లో వెతుకగా, వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి యొక్క యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, మరియు ఫేస్‌బుక్ అకౌంట్లు మాకు దొరికాయి. వైరల్ అవుతున్న వీడియోని మహమ్మద్ హస్సన్ అనే వ్యక్తి ఏడు రోజుల క్రితం అప్లోడ్ చేశాడు.
మహమ్మద్ హస్సన్ సోషల్ మీడియాని సరిగ్గా పరిశీలించి చూస్తే, ఇతను ఉత్తర్ ప్రదేశ్ యొక్క మొరదాబాద్ నివాసి అని, తాను ఒక మార్షల్ ఆర్టిస్ట్ మరియు ట్రైనర్ అని మాకు తెలిసింది. ఇతను సోషల్ మీడియాలో మార్టియల్ ఆర్ట్స్ ట్రైనింగ్ మరియు సెల్ఫ్ డిఫెన్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాడు. ఇతని ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ నిండా ఇవే వీడియోస్ ఉన్నాయి.
చివరిగా, ఉత్తర్ ప్రదెశ్‌కి చెందినమహమ్మద్ హస్సన్ అనే ఒక మార్షల్ ఆర్టిస్ట్ వీడియోని, హిందువులని ఎలా చంపాలో ట్రైనింగ్ అవుతున్న ఒక ముస్లిం వ్యక్తి వీడియో అని తప్పుదోవ పట్టించే సమాచారం షేర్ చేస్తున్నారు.