వక్ఫ్ సవరణ చట్టం, 2025ని వ్యతిరేకిస్తూ, ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్లోని చాలా చోట్ల నిరసనలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ ఆందోళనులు హింసాత్మకంగా మారి, గొడవలు, అల్లర్లు కూడా జరిగాయని వార్తా కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ కథనాల ప్రకారం( ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), ముర్షిదాబాద్‌లో జరిగిన గొడవల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, ఇందులో చందన్ దాస్, హరగోబింద్ దాస్ అనే ఇద్దరు హిందువులు ఒక మూక దాడిలో మరణించగా, ఒక ముస్లిం వ్యక్తి పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. ముర్షిదాబాద్ జిల్లాలో జరుగుతున్న ఈ హింసను తప్పించుకోవడానికి వందలాది హిందువులు తమ ఇళ్లను వదిలి, ఆశ్రయం పొందడానికి మాల్డా నగరానికి చేరుకున్నారని కూడా మీడియా రిపోర్ట్ చేసింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర బలగాలని మోహరించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది (ఇక్కడ, ఇక్కడ). ఈ అల్లర్లకు సంబంధించి సుమారు 150 పైగా వ్యక్తులు అరెస్ట్ అయ్యారు (ఇక్కడ, ఇక్కడ).
ఈ నేపథ్యంలో ‘పశ్చిమ బెంగాల్ లో దారుణమైన పరిస్థితి 😡 West Bengal లో ఒకే కుటుంబానికి చెందిన 3 హిందువులని చంపేశారు’ అని క్లెయిమ్ చేస్తూ, కొందరు వ్యక్తులు నలుగురిపై రాళ్లు రువ్వుతున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరిగిన దాడిని చూపిస్తున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియోకి ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్ జరిగిన హింసాత్మక అల్లర్లకు ఎటువంటి సంబంధం లేదు. ఇది ఏప్రిల్ 2024లో రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఒక భూవివాదం నేపథ్యంలో ఒక వర్గం వారు మరో వర్గానిపై రాళ్లు రువ్వి దాడి చేసిన సంఘటనకి చెందిన వీడియో. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి వైరల్ వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఈ సంఘటనకి చెందిన ఏప్రిల్ 2024 నాటి అనేక వార్తా కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ఈ వీడియో రాజస్థాన్‌లోని జైపుర్‌లో రికార్డు చేయబడింది.
వివరాల్లోకి వెళితే, జైపుర్‌లోని మాల్పురా గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సంగానేర్ అనే ప్రాంతంలో ఒక భూవివాదం నేపద్యంలో ఒక 50-60 వ్యక్తుల గుంపు, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపై దాడి చేసి, వాళ్ళు ఉంటున్న ఇంట్లో నుంచి తరిమి కొట్టారు. అప్పట్లో ఈ వీడియో వైరల్ అయ్యింది అని వార్తా కథనాలు పేర్కొన్నాయి.
NDTV రాజస్థాన్ వారి ఏప్రిల్ 2024 నాటి కథనం ప్రకారం, ముందుగా ఈ గుంపు, నిందితుడు శంకర్ సూయివాల్ ఇంట్లో ఉన్న ఆడవారితో తప్పుగా వ్యవహరించారు, ఆ తర్వాత వారిపై రాళ్లు రువ్వారు. బయానా, భరత్పూర్ వాస్తవ్యులైన సుభాష్ చంద్, నంద కిషోర్ అనే వ్యక్తులు తన పూర్వీకుల ఆస్తిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు అని నిదితుడు శంకర్ చెప్పినట్లు NDTV పేర్కొంది.
పోలీసు వారు ఇది పాత వివాదం అని అప్పట్లో మీడియాకి తెలిపారు, అలాగే నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు ACP వినోద్ శర్మ మీడియాకి చెప్పారు. ఈ ఆధారాలను బట్టి ఈ సంఘటన 2024లో రాజస్థాన్‌లో జరిగింది అని మనకు స్పష్టం అవుతుంది.
చివరాగా, ఏప్రిల్ 2024లో రాజస్థాన్‌లోని జైపుర్‌లో జరిగిన ఒక భూతగాదా దాడికి సంబంధించిన వీడియోని ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన హింసాత్మక అల్లర్లకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.