బంగ్లాదేశ్‌లోని ఒక పాఠశాలలో విద్యార్థినుల మధ్య జరిగిన ఒక గొడవ వీడియోను భారత్‌కు చెందినదని చెప్తూ షేర్ చేస్తున్నారు

భారతదేశంలో ఒక ముస్లిం బాలిక ఒక హిందూ బాలికను చెంపదెబ్బ కొట్టి, ఆమె సోదరుడితో సంబంధం పెట్టుకోమని బలవంతం చేస్తున్న దృశ్యాలని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ) షేర్ చేయబడుతోంది. ‘ముస్లిం దుర్మార్గపు మదపు పిల్ల హిందూ అమ్మాయిని కొడుతుంది కొడుతూ మా అన్న తో వెళ్లి తనకు సుఖాన్ని ఇవ్వాలని చెబుతుంది 14% ఉంటేనే ఈల ఉంటే విల్లు 40% అయితే ఊహించుకొండి, అందుకే ముస్లిం జనాభా ను ఎక్కడికి అక్కడ చంపెయాలి లేద దేశం నుండి వెళ్లగొట్టాలి,’ అని చెప్తూ సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: భారతదేశంలో ఒక ముస్లిం బాలిక ఒక హిందూ బాలికను చెంపదెబ్బ కొట్టి, ఆమె సోదరుడితో సంబంధం పెట్టుకోమని తనను బలవంతం చేస్తున్న వీడియో.

ఫ్యాక్ట్ (నిజం): ఇది బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని మీర్‌పూర్‌లోని షహీద్ ముక్తిజోద్ధ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటనది. దీనికి, భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు. ఇందులో కనిపిస్తున్న విద్యార్థినులు ముస్లింలే అని, అలాగే ఈ సంఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ బూమ్ బంగ్లాదేశ్‌ ఫ్యాక్ట్ చెక్ సంస్థకు చెప్పారు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది. 

వైరల్ వీడియోను సరిగ్గా పరిశీలించగా, అందులో ఉన్న పిల్లల యూనిఫాంపై ఉన్న స్కూల్ బ్యాడ్జ్ మాకు కనిపించింది. అలాగే దానిపై “షహీద్ ముక్తిజోద్ధ గర్ల్స్ హై స్కూల్” (బెంగాలీలో: শহীদ মুক্তিযোদ্ধা গার্লস হাই স্কুল) అని ఉంది. ఇంటర్నెట్‌లో ఒక కీవర్డ్ సెర్చ్ ద్వారా ఆ స్కూల్ బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఉన్న మీర్‌పూర్‌లో ఉందని మాకు తెలిసింది. ఇక ఆ యూనిఫాంపై ఉన్న బ్యాడ్జ్‌ను షహీద్ ముక్తిజోద్ధ గర్ల్స్ హై స్కూల్ అధికారిక లోగోతో మేము పోల్చి చూడగా, రెండూ ఒకేలా ఉన్నాయని మేము కనుగొన్నాము. ఈ పోలికను మీరు క్రింద చూడవచ్చు.

షహీద్ ముక్తిజోద్ధ గర్ల్స్ హై స్కూల్ యొక్క అధికారిక ఫేస్‌బుక్ పేజీలో వైరల్ వీడియోలో కనిపించే లాంటి యూనిఫామ్‌లలో ఉన్న విద్యార్థుల అనేక ఫోటోలు ఉన్నాయి. దీనిబట్టి, వీడియోలోని విద్యార్థులు ఢాకాలోని మీర్‌పూర్‌లో ఉన్న ఈ పాఠశాలకు చెందినవారని, మనకు అర్థం అవుతుంది.

వీడియోను తీసిన లొకేషన్, బంగ్లాదేశ్‌లోని సెక్షన్-12, బ్లాక్-డి, రోడ్-18, పల్లాబి, మీర్‌పూర్‌, ఢాకా-1216 వద్ద ఉన్న షహీద్ ముక్తిజోద్దా గర్ల్స్ హై స్కూల్‌గా మేము గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి కనుగొన్నాము. వీడియోలోని బ్యాగ్రౌండులో కనిపించే భవనాలు, పరిసరాలు ఈ స్కూల్‌ దృశ్యాలతో సరిపోలుతున్నాయి. వీడియో అక్కడే చిత్రీకరించబడిందని ఇది నిర్ధారిస్తుంది. ఈ రెండిటి మధ్య పోలికను మీరు క్రింద చూడవచ్చు.

అదనంగా, పశ్చిమ బెంగాల్ పోలీసులు, 28 జూలై 2025న చేసిన ఒక X పోస్టు (ఆర్కైవ్ లింక్) ద్వారా, ఈ వీడియో భారతదేశంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌కు చెందినదని షేర్ చేస్తున్నారని. కాని, ఇది బంగ్లాదేశ్‌లోని ఢాకాకు చెందినదని స్పష్టం చేశారు.

షహీద్ ముక్తిజోద్దా గర్ల్స్ హై స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ ఖోడేజా బేగం రినా, బూమ్ బంగ్లాదేశ్‌తో అనే ఫ్యాక్ట్ చెక్ సంస్థతో మాట్లాడుతూ, ఈ సంఘటన రెండేళ్ల క్రితం ఆ పాఠశాలలో జరిగిందని, అలాగే దాన్ని ఆ సమయంలో పరిష్కరించబడడం జరిగిందని చెప్పారు. గొడవలో పాల్గొన్న విద్యార్థులు ప్రస్తుతం యథావిధిగా పాఠశాలకు హాజరవుతున్నారని ఆమె పేర్కొన్నారు. వీడియోలో కనిపించే వారందరూ ముస్లింలు కాబట్టి, ఈ సంఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదని కూడా రీనా స్పష్టం చేశారు. ఒక విఫలమైన రిలేషన్‌షిప్ కారణంగా ఈ ఇద్దరు బాలికల మధ్య ఈ ఘర్షణ జరిగిందని, ఆమె వివరించారు.

అయితే, ఈ గొడవ వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాన్ని లేదా పూర్తి సందర్భాన్ని, అలాగే ఇందులో ఏదైనా మతపరమైన కోణం ఉందా లేదా అనే వివరాలను మేము స్వతంత్రంగా ధృవీకరించలేకపోయాము. కానీ, ఈ వీడియో బంగ్లాదేశ్‌లోని మీర్‌పూర్‌లో తీసిందని, దీనికి భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు అని కచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, బంగ్లాదేశ్‌లోని ఒక పాఠశాలలో ఇద్దరు విద్యార్థినుల మధ్య జరిగిన గొడవ యొక్క వీడియో భారతదేశానికి చెందినదని తప్పుగా షేర్ చేస్తున్నారు.