ఇండోనేషియాలోని ఒక నిర్మాణం కూల్చివేతకు సంబంధించిన దృశ్యాలను ఉత్తరాఖండ్‌లో అక్రమంగా నిర్మించిన ఒక మసీదుని కూల్చివేశిన దృశ్యాలని తప్పుగా షేర్ చేస్తున్నారు

ఒక ఆకుపచ్చ రంగు మసీదు లాంటి నిర్మాణాన్ని కూల్చివేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ). ఈ వీడియోను ఉత్తరాఖండ్‌లో అక్రమంగా నిర్మించిన మసీదు కూల్చివేశారనే వాదనతో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరాఖండ్‌లో అక్రమంగా నిర్మించిన మసీదును కూల్చివేస్తున్న దృశ్యాలు. 

ఫాక్ట్(నిజం): వైరల్ వీడియో ఇండోనేషియాలోని హబిస్కస్ ఫాంటసీ పాన్‌కేక్ వద్ద ఒక నిర్మాణాన్ని కూల్చివేస్తున్న దృశ్యాలను చూపిస్తుంది. లైసెన్స్ లేని భవనాలను తొలగించి అటవీ కార్యకలాపాలను పునరుద్ధరించే ఆపరేషన్‌లో భాగంగా వెస్ట్ జావా గవర్నర్ దేడి ముల్యాడి కూల్చివేతకు ఆదేశించారు. ఈ వీడియోకు ఉత్తరాఖండ్‌తో ఎలాంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ వీడియోలోని కీ ఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను ఒక టిక్‌టాక్‌ పోస్ట్ లో గుర్తించాము. ఈ పోస్ట్ యొక్క వివరణ ప్రకారం, బోగోర్‌లోని పాన్‌కాక్‌లోని హబిస్కస్ టూరిస్ట్ స్పాట్ కూల్చివేతలో ఇది 2వ రోజు అని, మరియు ఆ భవనం మసీదు కాదని, ఫాంటసీ పార్కులోని భారతీయ శైలి నిర్మాణం అని పేర్కొంది. ఇంటర్నెట్‌లో ‘హబిస్కస్ పాన్‌కాక్‌ బోగోర్‌’ అని వెతకగా, ఇది ఇండోనేషియాలో ఉన్నట్లు తెలిసింది.

టిక్‌టాక్ పోస్ట్ నుండి పొందిన క్లూస్ ఆధారంగా, తగిన కీవర్డ్స్ ఉపయోగించి మరింత వెతకగా, ఈ సంఘటనకు సంబంధించిన మరొక వీడియో లభించింది. ఈ వీడియో 10 మార్చి 2025న ‘న్యూ ఫార్సీ ఆఫిషియల్’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడింది, ఇది ఇండోనేషియాలోని హబిస్కస్ ఫాంటసీ పాన్‌కాక్‌ అని పేర్కొంది .

ఈ సంఘటనకు సంబంధించిన పలు వార్త కథనాలు (ఇక్కడ , ఇక్కడ , ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాలు ప్రకారం, ఈ సంఘటన హబిస్కస్ ఫాంటసీ పాన్‌కాక్‌వద్ద జరిగింది, వెస్ట్ జావా గవర్నర్ దేది ముల్యాది,  లైసెన్స్ లేని భవనాలను కూల్చివేయాలని ఆదేశించారు. ఈద్ కు ముందు నిషేధిత మండలాల్లోని వాటితో సహా 25 అనధికార నిర్మాణాలను తొలగించడం ఈ ఆపరేషన్ లక్ష్యం అని వార్త కథనాలు తెలిపాయి.

ఫారెస్ట్ రిస్టోరేషన్, వరద నివారణ చర్యలలో భాగంగా, ఇండోనేషియా రాజకీయ నాయకుడు, పర్యావరణ కార్యకర్త కాంగ్ డెడీ ముల్యాది 06 మార్చి 2025న కూల్చివేతను నిర్వహించారు. ఈ ప్రదేశం వెస్ట్ జావాలోని బోగోర్‌లో ఆకస్మిక వరదలకు కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా, పర్యావరణ మంత్రి హనీఫ్ ఫైసోల్ సహా కీలక అధికారులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. 

ఈ అభివృద్ధి ప్రాంతం యొక్క సహజ నిర్మాణాన్ని దెబ్బతీసిందని, వరదలకు దోహదపడిందని, ఈ విపత్తు వల్ల ప్రభావితమైన స్థానికులు కూల్చివేతకు మద్దతు ఇచ్చి, ఈ ప్రక్రియకు సహాయం చేశారని ముల్యాది పేర్కొన్నారు.

హబిస్కస్ ఫాంటసీ పాన్‌కేక్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో 23 జనవరి 2025న చేసిన ఒక పోస్ట్ లో వైరల్ వీడియో ఉన్న భవనాన్ని మేము కనుగొన్నాము.

చివరిగా, ఇండోనేషియాలోని ఒక నిర్మాణం కూల్చివేతకు సంబంధించిన దృశ్యాలను ఉత్తరాఖండ్‌లో అక్రమంగా నిర్మించిన ఒక మసీదుని కూల్చివేశిన దృశ్యాలని తప్పుగా షేర్ చేస్తున్నారు.