“కుంభ మేళా వెళ్ళే దారిలో ట్రెయిన్ పై రాళ్లు రువ్విన పందులకు ట్రీట్మెంట్ చాలు హోగయ..…” అని క్లెయిమ్ చేస్తూ, కొందరు పోలీసులు ఒక వ్యక్తిని కొట్టి వారి వాహనంలోకి ఎక్కిస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: ఈ వీడియోలో పోలీసులు కుంభమేళాకు వెళ్లే ట్రైన్ మీద రాళ్లు రువ్విన వారిపై చర్య తీసుకుంటున్నారు.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో పశ్చిమ బెంగాల్‌లోని బీర్భుమ్ జిల్లాలో ఒక పోలీస్ అధికారితో దురుసుగా వ్యవహరించిన ఒక వ్యక్తిని పోలీసులు కొడుతున్న సంఘటనకు సంబంధించింది. సూరి నగరంలో, 28 జనవరి 2025న త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలు మధ్య జరిగిన ఒక ఘర్షణను అదుపులోకి తేవడానికి పోలీసులు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ పోస్టు వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికాము. ఈ సెర్చ్ ద్వారా ఈ వీడియో ఉన్న కొన్ని సోషల్ మీడియా పోస్టులు (ఇక్కడ, ఇక్కడ) మాకు దొరికాయి.
వీటిల్లో ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని బీర్భుమ్ జిల్లాలో ఉన్న సూరిలో జరిగింది అని ఉంది. దీన్ని ఆధారంగా తీసుకొని ఇంటర్నెట్లో ఒక కీ వర్డ్ సెర్చ్ చేసి వెతకగా, వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలు ఉన్న అనేక వార్తా కథనాలు(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) లభించాయి.
ఈ వార్తా కథనాల ప్రకారం, ఈ సంఘటన 28 జనవరి 2025న పశ్చిమ బెంగాల్‌లోని సూరిలో ఉన్న మినిస్టిల్ ఏరియాలో జరిగింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఒక భూ వివాదం నేపథ్యంలో జరిగిన ఒక ఘర్షణను అదుపులోకి తీసుకొని రావడానికి పోలీసులు వెళ్లారు.
ఆ సమయంలో ఒక వ్యక్తి ఇన్స్పెక్టర్ ఇన్ చార్జ్ యొక్క కాలర్ పట్టుకుని తప్పుగా వ్యవహరించాడు. ఈ సంఘటనకు (ఇక్కడ, ఇక్కడ) చెందిన దృశ్యాలనే వైరల్ వీడియోలో చూపిస్తూ, దీన్ని కుంభమేళా వెళ్లే ట్రైన్ మీద రాళ్లు రువ్విన వారిపై పోలీసులు చర్య తీసుకుంటున్నారు అని తప్పుగా షేర్ చేస్తున్నారు.
ఈ సంఘటనలో పోలీసులు 20 మందిని అరెస్ట్ చేసి, మూడు తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై బీర్భూమ్ జిల్లా త్రిణమూల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనుబ్రతా మండల్ స్పందిస్తూ, ఇలా చేసిన వారెవారినీ పోలీసులు విడిచిపెట్టరు అని అన్నారు.
ఇక కుంభమేళాకు వెళ్తున్న ట్రైన్‌పై దాడి చేసిన వారిపై పోలీసులు దాడి చేశారు అనే విషయాన్ని వెరిఫై చేయడానికి ఇంటర్నెట్లో కీ వర్డ్ సెర్చ్ చేయగా, మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లభించలేదు.
పశ్చిమ బెంగాల్‌లోని బీర్భుమ్ జిల్లాలో పోలీసులకు స్థానికులకు మధ్య ఒక భూ వివాదం నేపథ్యంలో జరిగిన ఘర్షణ వీడియోని కుంభమేళాకు ముడిపెడుతూ తప్పుగా షేర్ చేస్తున్నారు.