ఒక బ్రిడ్జి (వంతెన) మీద ఉన్న పిల్లర్లపై ఉన్న కాంక్రీట్ చేతితో గీకితే రాలుతున్న దృశ్యాలని చూపిస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఈ బ్రిడ్జిని తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టారని చెప్తూ, కొంత మంది ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జి యొక్క పిల్లర్ల యొక్క రాడ్ల మధ్యలో ఉన్న కాంక్రీట్ నాణ్యత పేలవంగా ఉండడం, రాడ్లు వంగిపోయి ఉండటం మనం చూడవచ్చు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: కేసీఆర్ పాలనలో తెలంగాణలో నిర్మించిన బ్రిడ్జి (వంతెన) యొక్క దృశ్యాలను చూపిస్తున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్న బ్రిడ్జి బీహర్‌లోని ముంగేర్-బాంకా జిల్లాల బార్డర్‌లో ఉన్న కుమార్ సర్ దౌరి గ్రామాల మధ్య, బధువా నదిపై ఉంది, తెలంగాణలో కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వైరల్ వీడియోని సరిగ్గా పరిశీలించగా, అందులో బ్రిడ్జిపై ఉన్న పెచ్చులు ఊడదీస్తున్న వ్యక్తి చేతిలో ఉన్న మైక్ పైన ‘Indian Nix’ అని రాసి ఉండటం మేము గమనించాము.
దీన్ని ఆధారంగా తీసుకొని, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతుకగా, ఈ వీడియో యొక్క అసలు వెర్షన్ మాకు ‘Indian Nix Shorts’ అనే యూట్యూబ్ ఛానల్‌లో మాకు లభించింది. ఈ ‘షార్ట్స్’ వీడియోను వాళ్లు 24 జనవరి 2025న అప్లోడ్ చేశారు. ఈ వీడియో యొక్క వివరణలో, ఈ బ్రిడ్జి బీహర్‌లో ఉందని పేర్కొన్నారు. ఈ వీడియోలో రిపోర్టర్ ఆ బ్రిడ్జి యొక్క పిల్లర్‌లు ఎంత నాసిరకమైన పదార్థాలను వాడి తయారు చేశారో చూపించాడు.
ఈ వీడియోతో పాటు, అదే రోజున ఈ ఛానల్ వారు ఈ బ్రిడ్జికి సంబంధించి ఒక వీడియో రిపోర్టును కూడా అప్లోడ్ చేశారు. ఇందులో ఈ బ్రిడ్జి బీహర్‌లోని కుమార్ సర్‌లో కన్వరియా యాత్రికులు వెళ్లే మార్గంలో ఉందని పేర్కొన్నారు.
ముందు అప్లోడ్ చేసిన ‘షార్ట్స్’ వీడియోలో కింద భాగంలో ఉన్న వీడియో క్లిప్పును మీరు ఈ వీడియోలో 0:16 సెకన్ల దగ్గర నుంచి చూడవచ్చు.
ఈ బ్రిడ్జి 2008లో కట్టబడిందని, కట్టిన కొన్నాళ్లకే అది కూలిపోయిందని ఈ రిపోర్టులో కనిపించే కొందరు వ్యక్తులు చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో చాలా మంది అధికారులు, బిల్డర్లు అవినీతి చేశారని వారు పేర్కొన్నారు. ఈ వీడియోలో చెప్పిన వివరాల ఆధారంగా మేము ఈ బ్రిడ్జిని గూగుల్ మ్యాప్స్‌లో లొకేట్ చేశాము.
ఈ బ్రిడ్జి బీహర్‌లోని ముంగేర్-బాంకా జిల్లాల బార్డర్‌లో ఉన్న కుమార్ సర్ దౌరి గ్రామాల మధ్య, బధువా నదిపై ఉంది. ‘Indian Nix Shorts’ వారి వీడియోలో కనిపిస్తున్న గుడి గోపురం, బ్రిడ్జి పిల్లర్లు, ఈ బ్రిడ్జితో మ్యాచ్ అవుతున్నాయి. ఈ రెండిటి మధ్య ఉన్న పోలికలను మీరు ఈ కింది ఫోటోలో చూడవచ్చు.
‘Indian Nix Shorts’ వారి వీడియోతో పాటు, ఈ బ్రిడ్జిపై కొందరు తీసిన వీడియోలు మాకు యూట్యూబ్‌లో లభించాయి (ఇక్కడ, ఇక్కడ). వీటిల్లో మనం ‘Indian Nix Shorts’ వారి వీడియోలో కనిపించే అదే బ్రిడ్జిని, గుడిని చూడవచ్చు.
అలాగే, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ బ్రిడ్జికి సంబంధించి మాకు కొన్ని వార్తా కథనాలు దొరికాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) . సెప్టెంబర్ 2020లో, ఆజ్ తక్, ETV భారత్ వారు ఈ బ్రిడ్జిని దౌరి బ్రిడ్జి అని పేర్కొంటూ కథనాలు ప్రచురించారు. వీటి ప్రకారం, సెప్టెంబర్ 2020లో ఈ బ్రిడ్జి యొక్క ఆరో పిల్లర్ కుంగిపోవడం వల్ల, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
దౌరి బ్రిడ్జి గురించి ఇటీవల వచ్చిన కొన్ని వార్తా కథనాలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ బ్రిడ్జి కూలిపోవడం వల్ల కన్వార్ యాత్రికులకు ఇబ్బంది కలుగుతుందని ఇందులో వారు పేర్కొన్నారు.
చివరగా, వైరల్ వీడియోలో కనిపిస్తున్న బ్రిడ్జి తెలంగాణలో లేదు, ఇది బీహర్‌లోని ముంగేర్-బాంకా జిల్లాల బార్డర్‌లో ఉన్న కుమార్ సర్ దౌరి గ్రామాల మధ్య, బధువా నదిపై ఉన్న దౌరి బ్రిడ్జి.