అమెరికాలోని ఇల్లినాయిస్‌లోని ‘టార్గెట్’ దుకాణం నుండి దొంగతనం చేయడానికి ప్రయత్నించిందని ఒక భారతీయ మహిళ జిమిషా అవ్లాని (అలియాస్ అనాయా) ఆరోపణలు ఎదుర్కొంటోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలో, తను ధరించిన దుస్తుల కింద దాచిన కొన్ని బట్టలని బయటికి తీస్తున్న ఒక మహిళ వీడియో ఒకటి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఇందులో కనిపిస్తున్న మహిళ జిమిషా అవ్లాని అని నెటిజన్లు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ వీడియోతో పాటు, జిమిషా ఫొటోలు, వైరల్ వీడియోలోని ఒక స్క్రీన్‌షాట్ ఉపయోగించి తయారు చేసిన ఒక కొలాజ్ (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) కూడా సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: అమెరికాలో ఒక దుకాణంలో దొంగతనం చేస్తుండగా పట్టుబడిన జిమిషా అవ్లాని అనే భారతీయ మహిళ ఫోటో, వీడియో.
ఫ్యాక్ట్ (నిజం): ఈ వీడియో మెక్సికోలో జరిగిన ఒక దొంగతనానికి చెందినది, దీనికి అమెరికాకు లేదా జిమిషా అవ్లాని అనే మహిళకు ఎలాంటి సంబంధం లేదు. వార్తా కథనాల ప్రకారం, వైరల్ వీడియోలో ఉన్న మహిళ 29 ఏప్రిల్ 2025న మెక్సికోలోని కోహుయిలాలోని సాల్టిల్లోలో ఉన్న కోపెల్ స్టోర్‌లో వస్తువులను దొంగిలిస్తూ పట్టుబడింది. కావున, ఈ పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
ముందుగా ఈ క్లెయిమ్‌ను వెరిఫై చేయడానికి, మేము వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను ఉపయోగించి ఇంటర్‌నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా, ఈ వీడియోలో కనిపిస్తున్న సంఘటనపై మెక్సికన్ మీడియా సంస్థలు ఏప్రిల్ & మే 2025లో ప్రచురించిన వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి.
ఈ కథనాల ప్రకారం, వీడియోలో కనిపిస్తున్న మహిళ, మెక్సికోలోని కోహుయిలాలోని సాల్టిల్లోలో ఉన్న ప్లాజా పాటియోలోని కోపెల్ స్టోర్ నుంచి వస్తువులను దొంగిలించడానికి ప్రయత్నించింది. ఆమె తాను ధరించిన దుస్తుల కింద అనేక బట్టలను దాచి, గర్భవతిగా నటిస్తూ ఈ దొంగతనానికి పాల్పడింది.
ఈ మహిళ తన దుస్తుల కింద కనీసం 10 జతల జీన్స్, అనేక టీ-షర్టులను దాచి పెట్టినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ కథనాల ప్రకారం, ఈ సంఘటన 29 ఏప్రిల్ 2025న మెక్సికోలో జరిగింది. ఈ సంఘటనపై ప్రచురించబడిన కథనాలలో, జిమిషా లేదా అనాయా అవ్లాని అనే భారతీయ మహిళ గురించి ఎటువంటి ప్రస్తావన లేదు.
ఇకపోతే, ఒక దుకాణంలో దొంగతనం చేసింది అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జిమిషా అవ్లానీకి సంఘటనకు సంబంధించిన వార్తా కథనాలలో (ఇక్కడ, ఇక్కడ) ‘బాడీ కామ్ ఎడిషన్’ అనే యూట్యూబ్ ఛానెల్‌ను తమ సోర్స్‌గా పేర్కొన్నాయి మీడియా సంస్థలు.
వారి ఛానెల్‌లో 14 జూలై 2025న అప్‌లోడ్ చేయబడిన పోలీసు బాడీ కామ్ ఫుటేజ్ ప్రకారం, ఈ సంఘటన 1 మే 2025న జరిగింది. ఈ వీడియోలో ఉన్న మహిళ (జిమిషా అవ్లానీ), వైరల్ వీడియోలో , కొలాజ్‌లో ఉన్న మొదటి ఫోటోలో కనిపిస్తున్న మహిళ ఒక్కరు కాదు.
చివరగా, మెక్సికోలో జరిగిన ఒక దొంగతనానికి చెందిన వీడియోని షేర్ చేస్తూ, అందులో ఉన్న మహిళ అమెరికాలోని ఇల్లినాయిస్‌లోని టార్గెట్ స్టోర్‌లో దొంగతనం చేస్తూ పట్టుబడిన భారతీయ మహిళ జిమిషా అవ్లానీ అని తప్పుదోవ పట్టించే విధంగా షేర్ చేస్తున్నారు.