ఈవీఎంలను నిషేధించాలని ఆగష్టు 2025లో భారీ ఆందోళనలు జరుగుతున్నాయని జనవరి 2024 నాటి వీడియోని షేర్ చేస్తున్నారు

ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగష్టు 2025లో ఆరోపణలు చేసిన నేపథ్యంలో, ఈవీఎంలను (Electronic Voting Machine) నిషేధించాలని కోరుతూ భారీ ఆందోళనలు జరుగుతున్నప్పటికీ ఏ ఒక్క ఛానెల్ చూపించట్లేదని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఈవీఎంలను (Electronic Voting Machine) నిషేధించాలని ఆగష్టు 2025లో జరిగిన భారీ ఆందోళనలకు సంబంధించిన వీడియో.

ఫాక్ట్: ఈ వీడియో జనవరి 2024 నాటిది. ఈవీఎంలను నిషేధించాలని కోరుతూ వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో 31 జనవరి 2024న ఆందోళన చేపట్టాయి. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) కనీసం ఫిబ్రవరి 2024 నుంచి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నట్లు గుర్తించాం. న్యూ ఢిల్లీలో ఈవీఎంలకు వ్యతిరేకంగా జరిగిన భారీ ఆందోళనలను ఈ వీడియో చూపుతుందని వివరణలో పేర్కొన్నారు.

ఈ ఆందోళనల గురించి మరింత వెతకగా, ఇవే దృశ్యాలు కలిగి ఉన్న పలు మీడియా కథనాలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) లభించాయి. వీటి ప్రకారం, 31 జనవరి 2024న ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఈవీఎంలను నిషేధించాలని వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. 2024 లోకసభ ఎన్నికల కంటే ముందే ఈవీఎంలను నిషేధించి పేపర్ బ్యాలెట్లను ప్రవేశపెట్టి ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

నవంబర్ 2024లో కూడా ఇదే వీడియోని మహారాష్ట్ర ఎన్నికలకు తప్పుగా ముడిపెడుతూ షేర్ చేసినప్పుడు మేము రాసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, ఈవీఎంలను నిషేధించాలని ఆగష్టు 2025లో భారీ ఆందోళనలు జరుగుతున్నాయని జనవరి 2024 నాటి వీడియోని షేర్ చేస్తున్నారు.