బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత తీసిన దృశ్యాలని చెప్తూ, డిసెంబర్ 2024 నాటి వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు

బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర శ్వాస సంబంధిత అనారోగ్య కారణాల వల్ల ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ, 12 నవంబర్ 2025న డిశ్చార్జి అయ్యారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ఆయన మరణించారని చాలా పుకార్లు వచ్చాయి, మీడియా కూడా ఈ విషయాన్ని చెబుతూ అనేక కథనాలు ప్రచురించింది.  

డిశ్చార్జ్ తర్వాత ధర్మేంద్ర చికిత్స ఇక ఇంట్లోనే కొనసాగుతుందని, ఆయనకు చికిత్స చేసిన డాక్టర్ పేర్కొన్నారని NDTV రిపోర్ట్ చేసింది. ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యాక, తన ఇంటి దగ్గరకి చేరుకున్న పాపరాజిపై (Paparazzi) ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ విరుచుకుపడ్డారని మీడియా రిపోర్ట్ చేసింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

ఈ నేపథ్యంలో, డిశ్చార్జ్ అయి ధర్మేంద్ర ఇంటికి చేరుకున్నప్పుడు తీసిన వీడియో అని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఈ వీడియోలో నటుడు ధర్మేంద్రతో పాటు ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ ఉన్నారు. ‘ఆస్పత్రి చికిత్స అనంతరం బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర ఇంటికి చేరుకున్నారు. సన్నీ & బాబీ డియోల్ వెంట ఉండగా, మీడియాను సన్నీ వినయంగా వెళ్లమని అభ్యర్థించారు’ అని చెప్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు సోషల్ మీడియా యూజర్లు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.  

క్లెయిమ్: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర 12 నవంబర్ 2025న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తీసిన వీడియో ఇది.   

ఫ్యాక్ట్(నిజం): ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం వాస్తవమే అయినా, ఈ వీడియో ఇప్పటిది కాదు. ధర్మేంద్ర యొక్క 89వ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన డిసెంబర్ 2024 నాటి వీడియో ఇది. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతుకగా, ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తీసిన వీడియో ఇది అని చెప్తూ, మాకు ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు. 

ఇక ఈ వీడియో గురించి మరిన్ని వివరాల కోసం, అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసాము. ఈ సెర్చ్ ద్వారా, ఈ వీడియోలోని దృశ్యాలను పోలిన డిసెంబర్ 2024 నాటి వీడియోలు మాకు కొన్ని లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

8 డిసెంబర్ 2024న జరిగిన, ధర్మేంద్ర 89వ పుట్టిన రోజు వేడుకలకు (ఇక్కడ, ఇక్కడ) చెందిన వీడియోలు ఇవి. ఈ వీడియోలను టైమ్స్ నౌ, ANI, వన్ ఇండియా వంటి మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). దీన్ని బట్టి, ఈ వీడియో నవంబర్ 2025 నాటిది కాదని మనకు స్పష్టం అవుతుంది.

చివరగా, బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, 12 నవంబర్ 2025న బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత తీసిన వీడియో అని చెప్తూ డిసెంబర్ 2024లో ఆయన 89వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా తీసిన వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు.