యూపీలో మహిళా పోలీసుపై దుండగులు కాల్పులు జరిపారంటూ వెబ్ సిరీస్‌ షూటింగ్ వీడియోని షేర్ చేస్తున్నారు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీలో ఒక మహిళా పోలీసు ఆఫీసర్‌పై కొందరు దుండగులు కాల్పులు జరిపారని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఈ వీడియోలో పోలీసు యూనిఫామ్ ధరించిన మహిళపై తుపాకీతో కాల్పులు జరిపినట్లు కనిపిస్తుంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: రాయ్‌బరేలీలో మహిళా పోలీసు ఆఫీసర్‌పై దుండగులు కాల్పులు జరుపుతున్నప్పటి వీడియో.

ఫాక్ట్: ఇది నిజమైన ఘటన కాదు. ఈ వీడియో ‘Crime Patrol 2.0’ అనే క్రైమ్ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో చిత్రీకరించబడింది. కావున, పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా, వైరల్ వీడియోనీ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, ఇదే వీడియోని (ఆర్కైవ్) అజయ్ గుప్తా అనే కంటెంట్ క్రియేటర్ 30 అక్టోబర్ 2025లో అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. ఇది ఒక షూటింగ్‌కి సంబంధించిన వీడియో అని ఆయన వివరణలో పేర్కొన్నారు. అజయ్ గుప్తా సోషల్ తన మీడియా ఖాతాల్లో (ఇక్కడ & ఇక్కడ) గతంలో వివిధ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, నాటికలకు సంబంధించిన షూటింగ్ వీడియోలను పోస్టు చేశారు.

ఇక వైరల్ వీడియో ఏదైనా వెబ్ సిరీస్‌/సీరియల్‌లో ఉందేమోనని సంబంధిత పదాలతో యూట్యూబ్‌లో వెతకగా, ఇదే సన్నివేశం ‘Crime Patrol 2.0’ అనే క్రైమ్ సిరీస్‌లో ఉన్నట్లు గుర్తించాం. దీనికి సంబంధించిన పూర్తి వీడియో ‘Nova Crime thrillers’ అనే యూట్యూబ్ ఛానెల్లో 23 సెప్టెంబర్ 2025న అప్లోడ్ చేయబడింది. ఇది పూర్తిగా కల్పితమైన కథ అని, కేవలం వినోదం కోసమే చిత్రీకరించినట్లు వీడియో వివరణలో పేర్కొనబడింది.

ఇక రాయ్‌బరేలీ పోలీసులు ఈ వీడియో గురించి వివరణ ఇస్తూ (ఆర్కైవ్), ఇది నిజమైన ఘటన కాదని, ఇది ఒక సినిమా/సిరీస్ షూటింగ్ వీడియో అని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఇటువంటి దుష్ప్రచారాలు చేసిన వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని రాయ్‌బరేలీ ఏఎస్పీ సంజీవ్ సిన్హా తెలిపారు.

చివరిగా, యూపీలో మహిళా పోలీసుపై దుండగులు కాల్పులు జరిపారంటూ వెబ్ సిరీస్‌ షూటింగ్ వీడియోని షేర్ చేస్తున్నారు.