2023 నాటి ఒక వీడియోను, ఇండోర్‌లో ఇటీవల ఈద్ రోజున హిందువుల ఇళ్లపై రాళ్లు రువ్వినందుకు కొందరు ముస్లింలను అర్థ నగ్నంగా ఊరేగించిన సంఘటన దృశ్యాలుగా తప్పుగా షేర్ చేస్తున్నారు

అర్ధ నగ్నంగా ఉన్న కొంతమంది చేతులని తాడులతో కట్టి, వీధుల్లో పోలీసులు ఊరేగిస్తున్న వీడియో ఒకటి (ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఏడాది 16 జూన్ 2024న జరుపుకున్న ఈద్ (బక్రీద్) సందర్భంగా ఇండోర్‌లోని కొందరు హిందువుల ఇళ్లపై రాళ్లు రువ్విన ముస్లింలు వీళ్ళు అని, ఇలా చేసినందుకు వీళ్ళని మధ్య ప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ గారి పోలీసులు ఇలా రోడ్లపై ఊరేగించారు అని క్లెయిమ్ చేస్తూ ఈ వీడియోని నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో చూద్దాం. 

క్లెయిమ్: ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో, బక్రీద్ సందర్భంగా హిందువుల ఇళ్లపై రాళ్లు రువ్వినందుకు కొంతమంది ముస్లిం పురుషుల చేతులను తాళ్లతో కట్టి అర్ధ నగ్నంగా ఊరేగించిన సంఘటనను ఈ వీడియో చూపిస్తుంది.

ఫ్యాక్ట్(నిజం): ఈ సంఘటన సెప్టెంబర్ 2023లో జరిగింది. అపుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు, మోహన్ యాదవ్ కాదు. అలాగే, ఈ సంఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నందుకు పోలీసులు ఈ వ్యక్తులను వీధుల్లో అర్ధ నగ్నంగా ఊరేగించారు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

వైరల్ క్లెయిమ్ యొక్క వాస్తవికతను తనిఖీ చేయడానికి, మేము సంబంధిత కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో కీవర్డ్ సెర్చ్ చేసాము. దీని మూలంగా, సెప్టెంబర్ 2023 నాటి ఈ వీడియోకు సంబంధించిన కొన్ని వార్తా కథనాలు దొరికాయి (ఇక్కడ మరియు ఇక్కడ).

టైమ్స్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 2023లో ప్రచురించిన ఒక రిపోర్ట్ ప్రకారం, “మధ్యప్రదేశ్ పోలీసులు ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేసి, ఇండోర్ వీధిలో అర్ధ నగ్నంగా ఊరేగించారు. వీరు రాళ్ల దాడికి పాల్పడ్డారని ఆరోపించి ఇలా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పురుషులు-‘ పత్తర్ బాజీ నహి కరేంగే, నహి కరేంగే’ అని నినాదాలు చేయడం ఈ వీడియోలో కనిపించింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు.,” అని రాశారు. 

ఈ ఘటన ఇండోర్‌లోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సంఘటన గురించి ఇండోర్ పోలీసులు మీడియాతో 2023 సెప్టెంబర్‌లో మాట్లాడుతూ (ఇక్కడ మరియు ఇక్కడ) ఈ సంఘటన రెండు ముఠాల మధ్య జరిగిందని స్పష్టం చేశారు.

ఒక పాత వివాదంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఇది వారి అరెస్టుకు దారితీసింది, ఆ తర్వాత పోలీసు అధికారులు వారిని వాళ్ళు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్న అదే ప్రదేశానికి తీసుకెళ్లి, అర్ధ నగ్నంగా ఊరేగించారు, వారితో ఈ ప్రవర్తనకు ప్రజలకు క్షమాపణలు చెప్పించారు. నిందితులను జుబేర్, మహమ్మద్ అమ్జాద్, మొయిన్ ఖురేషీ, వసీం, మొహ్సిన్ ఖురేషీ, మస్రూఫ్, ఇమ్రాన్ (ఈటీవీ భారత్ ప్రకారం షారుక్)గా పోలీసులు గుర్తించారు.

అదనంగా, ఈ సంఘటన సెప్టెంబర్ 2023లో జరిగినప్పుడు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మోహన్ యాదవ్ కాదు. మోహన్ యాదవ్ డిసెంబర్ 2023లో ముఖ్యమంత్రి అయ్యారు (ఇక్కడ మరియు ఇక్కడ).

చివరిగా, కొందరు పురుషులను పోలీసులు వీధిలో అర్ధ నగ్నంగా ఊరేగిస్తున్న ఈ వీడియో ఇటీవలది కాదు, సెప్టెంబర్ 2023 నాటిది.