మార్చి 2025లో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని దర్గాకు పోలీసులు తాళం వేశారని పేర్కొంటూ 2023 నాటి వీడియోను షేర్ చేస్తున్నారు

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలోని రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న దర్గాను తొలగించాలని గత కొన్ని రోజులుగా పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు భక్తులు ‘దర్గా హఠావో.. వేములవాడ బచావో’ అని చీటీలు రాసి హుండీలో వేసినట్లు పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి (ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలో,“వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని దర్గాను మూసి వేసారు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ పోస్టుకు మద్దతుగా, ఓ ఆలయం ప్రాంగణంలో ఉన్న దర్గాకు పోలీసులు తాళం వేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియోను జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవల, మార్చి 2025లో, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని దర్గాకు పోలీసులు తాళం వేశారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో సెప్టెంబర్ 2023 నాటిది. మీడియా కథనాల ప్రకారం, శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్న దర్గా నిర్వహణపై రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం కారణంగా పోలీసులు అప్పట్లో దర్గాకు తాళం వేశారు. Factly తో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వాహక అధికారి (EO) మాట్లాడుతూ, “ఈ వీడియో 2023 నాటది, అప్పుడు దర్గా నిర్వహణపై రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం కారణంగా పోలీసులు దర్గాకు తాళం వేశారు, దర్గా ప్రస్తుతం మూసివేయబడలేదు, యథావిధిగా భక్తులకు తెరిచి ఉంది” అని చెప్పారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా, ఇటీవల మార్చి 2025లో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోనీ దర్గాకు పోలీసులు తాళం వేశారా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ క్లెయింను సమర్థించే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు. ఈ క్రమంలోనే, వైరల్ వీడియోలోని దృశ్యాలనే కలిగి ఉన్న వీడియోను 09 సెప్టెంబర్ 2023న “వేములవాడ ఆలయంలోని దర్గా కు తాళం వేసిన పోలీసులు” అనే శీర్షికతో ‘భారత్ టుడే’ అనే వార్త సంస్థ వారి యూట్యూబ్ ఛానల్ షేర్ చేసినట్లు గుర్తించాము. దీన్ని బట్టి ఈ వీడియో పాతది అని మనం నిర్ధారించవచ్చు.

ఈ సమాచారం ఆధారంగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ వీడియోలోని దృశ్యాలనే రిపోర్ట్ చేస్తూ సెప్టెంబర్ 2023లో ప్రచురించబడిన పలు వార్తాకథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్న హజ్రత్ సయ్యద్ తాజుద్దీన్ ఖాజా బాగ్ సవార్ దర్గా నిర్వహణ అంశం పై ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదం కారణంగా పోలీసులు దర్గాకు తాళం వేశారు. అప్పట్లో కొంత కాలంగా ఓ వర్గం దర్గాను నిర్వహిస్తుండగా ఇటీవల మరోవర్గం దర్గాపై తమకే హక్కులు ఉన్నాయని హైకోర్టుకి వెళ్లింది, కోర్టు ఆర్డర్ కాపీని తీసుకొని, దర్గాలో కూర్చున్న మరో వర్గం వారిని వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేయగా, దర్గాపై హక్కులు తమవేనని అని ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది, సమాచారం అందుకున్న వేములవాడ పట్టణ పోలీసులు శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయం వద్దకు చేరుకొని దర్గాలో ఎవరు పూజలు చేయాలన్న దానిపై నిర్ణయం వచ్చేంత వరకు ఇరు వర్గాలు లోపలికి ప్రవేశించరాదని, ఇరు వర్గాలను బయటకు పంపి దర్గాకు తాళం వేశారు అని ఈ కథనాలు పేర్కొన్నాయి. 2023లో ఈ ఘటన నేపథ్యంలో ఓ వర్గం వారు మరో వర్గం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ ఫిర్యాదు పై పోలీసులు నమోదు చేసిన FIR కాపీని ఇక్కడ చూడవచ్చు.  

తదుపరి మేము ఇటీవల కాలంలో కూడా దర్గాకు పోలీసులు తాళం వేశారా? అని తెలుసుకోవడానికి, వేములవాడ టౌన్ పోలీసులను సంప్రదించగా, Factly తో వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వీర ప్రసాద్ మాట్లాడుతూ, “ఈ వీడియో పాతది, ఇప్పుడు ఇలాంటి ఘటన ఏది వేములవాడ దర్గా వద్ద జరగలేదు” అని చెప్పారు.

అలాగే, ఇదే విషయం గురించి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వాహక అధికారి (EO)ని సంప్రదించగా, Factly తో మాట్లాడుతూ, “ఈ వీడియో 2023 నాటది, అప్పుడు దర్గా నిర్వహణపై రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం కారణంగా పోలీసులు దర్గాకు తాళం వేశారు, దర్గా ప్రస్తుతం మూసివేయబడలేదు, యథావిధిగా భక్తులకు తెరిచి ఉంది” అని చెప్పారు.

చివరగా, మార్చి 2025లో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని దర్గాకు పోలీసులు తాళం వేశారని పేర్కొంటూ 2023 నాటి వీడియోను షేర్ చేస్తున్నారు.