సునీతా విలియమ్స్ 2012 స్పేస్ స్టేషన్‌ పర్యటన నాటి వీడియోను ‘ఆమె బోయింగ్ స్టార్‌లైనర్ మిషన్(2024) నుండి త్వరలో భూమికి తిరిగి వస్తుంది’ అంటూ షేర్ చేస్తున్నారు

6 జూన్ 2024న, సునీతా విలియమ్స్, విల్మోర్ 10-రోజుల మిషన్ కోసం ISSతో బోయింగ్ స్టార్‌లైనర్‌ను విజయవంతంగా డాక్ చేశారు (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ నేపథ్యంలో సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పర్యటన చేస్తున్న వీడియో ఒకటి “విజయవంతమైన 127 రోజుల స్పేస్ టూర్ తర్వాత, సునీతా విలియమ్స్ త్వరలో సురక్షితంగా భూమికి చేరుకోనుంది” అంటూ సోషల్ మీడియాలో(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథం ద్వారా తెలుసుకుందాం. 

ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: సునీతా విలియమ్స్‌ 127 రోజుల తరువాత భూమి పైకి చేరుకోనుంది. ఇది తను 2024లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో పర్యటిస్తున్న వీడియో. 

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో నవంబర్ 2012 నాటిది. 6 జూన్ 2024 నుండి, సునీతా విలియమ్స్ బారీ విల్మోర్‌తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. బోయింగ్ స్టార్‌లైనర్ టెస్ట్ ఫ్లైట్‌లో సమస్యల కారణంగా వారి 10-రోజుల మిషన్ ఫిబ్రవరి 2025 వరకు పొడిగించబడింది. వారు ఇప్పుడు 240 రోజుల పాటు అంతరిక్షంలో ఉంటారని అంచనా. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

వైరల్ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, 20 నవంబర్ 2012న నాసా ప్రచురించిన ఇదే వీడియోను మేము కనుగొన్నాం. “అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కమాండర్‌గా ఉన్న చివరి రోజులలో NASAకి చెందిన సునీతా విలియమ్స్ కక్ష్య ప్రయోగశాలలో విస్తృత పర్యటనను రికార్డ్ చేసారు. 18 నవంబర్ 2012 వీడియోను డౌన్‌లింక్ చేసారు. ఇది ఆమె, కాస్మోనాట్ యూరి మాలెన్‌చెంకో మరియు ఫ్లైట్ ఇంజనీర్ అకీ హోషిడ్‌కి వారి Soyuz TMA-05M స్పేస్‌క్రాఫ్ట్‌లో బయలుదేరే కొద్ది గంటల ముందు చిత్రీకరించబడింది. ఈ పర్యటనలో స్టేషన్‌లోని ప్రతి మాడ్యూల్‌లు మరియు పరిశోధనా సౌకర్యాల దృశ్యాలు మరియు కక్ష్య ఔట్‌పోస్ట్‌లో జరిగిన మరియు కొనసాగుతున్న పని గురించి విలియమ్స్ ద్వారా రన్నింగ్ కథనం ఉంటుంది” అంటూ ఈ వీడియో వివరణలో పేర్కొంది.

సునీతా విలియమ్స్ ఇటీవలి(2024) అంతరిక్ష యాత్ర గురించి వెతికితే,  6 జూన్ 2024 నుండి, సునీతా విలియమ్స్ బారీ విల్మోర్‌తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు అని, బోయింగ్ స్టార్‌లైనర్ టెస్ట్ ఫ్లైట్‌లో సమస్యల కారణంగా వారి 10-రోజుల మిషన్ కాస్త ఫిబ్రవరి 2025 వరకు పొడిగించబడింది అని తెలుసుకున్నాం. వారు ఇప్పుడు 240 రోజుల పాటు అంతరిక్షంలో ఉంటారని అంచనా. వారు NASA యొక్క SpaceX క్రూ-9 మిషన్‌లో మరో ఇద్దరు సిబ్బందితో SpaceX డ్రాగన్ అంతరిక్ష నౌకలో 2025లో తిరిగి వస్తారు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). 

బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక నుండి సునీతా విలియమ్స్ ఇటీవల (2024) తీసిన లైవ్ టూర్ వీడియోను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, సునీతా విలియమ్స్ స్పేస్ స్టేషన్‌లో పర్యటించిన 2012 నాటి వీడియోను ‘ఆమె బోయింగ్ స్టార్‌లైనర్ మిషన్(2024) నుండి త్వరలో భూమికి తిరిగి వస్తుంది’ అంటూ షేర్ చేస్తున్నారు.