మే 2022లో అమెరికాలో తీసిన ఒక వీడియోని తప్పుగా హైదరాబాద్ కంచ గచ్చిబౌలి వివాదానికి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

3 ఏప్రిల్ 2025న, భారత సుప్రీంకోర్టు హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ఆనుకుని ఉన్న కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చెట్ల నరికివేత కార్యకలాపాలపై స్టే (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) విధించింది. వార్తా కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), ఈ ప్రాంతం వలస పక్షులు, నెమళ్ళు, మచ్చల జింకలు, అడవి పందులు, భారతీయ రాతి కొండచిలువ, భారతీయ నక్షత్ర తాబేళ్లు వంటి అనేక జాతుల వృక్షజాలం, జంతుజాలానికి నిలయంగా ఉంది. ఏప్రిల్ 2025 నాటి వార్తా కథనాల ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం సంబంధిత భూమిని ఖాళీ చేసిన తర్వాత ఈ ప్రాంతంలో రెండు జింకలు చనిపోయాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

కంచ గచ్చిబౌలి ప్రాంతంలో చెట్లను తొలగించడం వల్ల హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని వన్యప్రాణులు దెబ్బతిన్నాయని వార్తా కథనాలు వస్తున్న నేపథ్యంలో ‘*HCU లో గూడు చేదిరిన తల్లీ జింక, పిల్ల జింక* రియల్ ఎస్టేట్ వ్యభిచారి భూ దాహనికి బలి అవుతున్న HCU లోని మూగ జీవాలు.,’ అని క్లెయిమ్ చేస్తూ, రెండు జింకలు రోడ్లపై తిరుగుతున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: HCUకి అనుకొని ఉన్న కంచ గచ్చిబౌలిలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చెట్ల నరికివేత కార్యకలాపాల కారణంగా వాటి గూడు కోల్పోయి రోడ్లపై తిరుగుతున్న రెండు జింకల వీడియో.

ఫ్యాక్ట్(నిజం): మే 2022లో అమెరికాలో తీసిన వీడియో ఇది, దీనికి హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి (HCU)ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ వీడియో మాకు ‘వైరల్ హాగ్’ అనే వెరిఫైడ్ యూట్యూబ్ ఛానల్‌లో దొరికింది (ఆర్కైవ్ లింక్).  

ఈ వీడియోని వారు 1 మే 2023లో ‘Confused Fawn Runs Toward Headlight || ViralHog’ అనే టైటిల్‌తో అప్లోడ్ చేశారు. ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం ఈ సంఘటన 9 మే 2022న అమెరికాలో జరిగింది.

ఈ వీడియో గురించి మరిన్ని వివరాల కోసం, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఇదే వీడియో మాకు ‘Newsflare’ అనే ఆన్లైన్ వీడియో న్యూస్ కమ్యూనిటీ వెబ్సైటులో దొరికింది. ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం, ఈ సంఘటన అమెరికాలోని మోంట్గోమారి కౌంటీలో 9 మే 2022న తీశారు. దీనిబట్టి, ఈ వీడియోకి 2025లో జరిగిన కంచ గచ్చిబౌలి వివాదానికి ఎటువంటి సంబంధం లేదు అని స్పష్టం అవుతుంది.

చివరగా, మే 2022లో అమెరికాలో తీసిన ఒక వీడియోని హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి అనుకొని ఉన్న కంచ గచ్చిబౌలి వివాదానికి ముడిపెడుతూ తప్పుగా షేర్ చేస్తున్నారు.