2025 బీహార్ ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ ‘వోట్ చోరీ’కి నిరసనగా పాట్నా వాసులు చేపట్టిన ర్యాలీ అని చెప్తూ సెప్టెంబర్ 2025లో జైపూర్‌లో తీసిన వీడియోను షేర్ చేస్తున్నారు

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నిర్ణయాత్మక విజయాన్ని సాధించింది, 243 సీట్లలో 202 సీట్లను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో, బీహార్ ఎన్నికలను రద్దు చేయాలని చెప్తూ అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయని చెప్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో మీద హిందీలో వోట్ చోరీకి నిరసనగా పాట్నాలో ప్రజలు నిరసన తెలిపాను’ అని రాసి ఉంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నవంబర్ 2025లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ ‘వోట్ చోరీ’కి నిరసనగా పాట్నా వాసులు చేపట్టిన నిరసనను ఈ వీడియో చూపిస్తుంది.  

 ఫ్యాక్ట్(నిజం): రాజస్థాన్‌లోని జైపూర్ నగరంలో 12 సెప్టెంబర్ 2025న జరిగిన ఒక కాగడాల ఊరేగింపుకు చెందిన వీడియో ఇది. దీనికి నవంబర్ 2025 బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి ముందుగా, అసలు నవంబర్ 2025 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న నిరసన బీహార్‌లోని పాట్నాలో జరిగింది అని ఏవైనా వార్తా కథనాలు వచ్చాయా అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికాము.

అయితే, ఈ సెర్చ్ ద్వారా, ఈ వీడియో బీహార్‌లోని పాట్నాలో జరిగిన ఒక నిరసనను చూపిస్తుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలూ లభించలేదు. అలాగే, నవంబర్ 2025 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీహార్‌లో జరిగిన నిరసనల గురించి మాకు ఎలాంటి విశ్వసనీయ వార్తా కథనాలు లభించలేదు.

తర్వాత, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను ఉపయోగించి ఇంటర్నెట్‌లో ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, నవంబర్ 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, సెప్టెంబర్ 2025లో పోస్ట్ చేసిన అనేక సోషల్ మీడియా పోస్టులు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ పోస్టులలో వైరల్ వీడియో ఉంది. అంటే, నవంబర్ 2025 బీహార్ ఎన్నికల కంటే ముందు నుంచే ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఉందని దీనిబట్టి మనకు స్పష్టం అవుతుంది. 

పోస్టుల ప్రకారం, జూలై 2025లో రాజస్థాన్‌లోని ఝాలావర్‌ జిల్లాలో పిప్లోడి గ్రామంలోని ఒక ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలడం వల్ల మరణించిన (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) పిల్లల కుటుంబాలకు న్యాయం జరగాలని, జైపూర్ యువత నిర్వహించిన ఒక ప్రదర్శనను ఈ వీడియో చూపిస్తుంది. 

ఈ ప్రదర్శన గురించి మరిన్ని వివరాల కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా మాకు ఈ ప్రదర్శన గురించి అనేక వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ కథనాల ప్రకారం,  పిప్లోడి పాఠశాల దుర్ఘటనలో మరణించిన పిల్లల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ 14 రోజుల నిరాహార దీక్ష చేస్తున్న నరేష్ మీనా అనే రాజస్థాన్ నాయకుడి మద్దతుదారులు ఈ టార్చ్ లైట్ మార్చ్/ కాగడాల మార్చ్ నిర్వహించారు.

అదనంగా, గూగుల్ మ్యాప్స్ సహాయంతో వైరల్ వీడియోను తీసిన లొకేషన్ మేము కనిపెట్టాము. ఇది రాజస్థాన్‌లోని జైపూర్ నగరంలో ఉన్న 11 గొపాల్‌పురా బైపాస్ దగ్గర ఉంది. దీన్ని బట్టి వైరల్ వీడియో నవంబర్ 20225 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది కాదని, 2025 సెప్టెంబర్ నెలలో రాజస్థాన్‌లో జరిగిన ఒక ప్రదర్శనకు సంబంధించిన వీడియో అని మనకు అర్థం అవుతుంది. ఇదే వీడియోను గతంలో ఉత్తర ప్రదేశ్‌లో పోలీసులకు వ్యతిరేకంగా జరిగిన ఒక నిరసన వీడియో అని షేర్ చేయగా, ఆ క్లయిమ్ తప్పు అని చెప్తూ మేము ఒక ఫ్యాక్ట్-చెక్ కథనాన్ని ప్రచురించాము. 

చివరగా, 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలని చెప్తూ, వోట్ చోరీకి నిరసనగా పాట్నా వాసులు నిరసన చేపట్టారని చెప్తూ సంబంధం లేని పాత వీడియోను షేర్ చేస్తున్నారు