పైరసీ ఆరోపణల మీద అరెస్ట్ అయిన ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడు ఇమ్మడి రవి (ఐబొమ్మ రవి) (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) కోర్టులో జడ్జి ముందు లైవ్ హ్యాకింగ్ డెమో చేసి చూపిస్తున్న దృశ్యాలంటూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: ఇమ్మడి రవి (ఐబొమ్మ రవి) కోర్టులో లైవ్ హ్యాకింగ్ డెమో ఇస్తున్న వీడియో.
ఫ్యాక్ట్ (నిజం): ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో, ఐబొమ్మ రవి కోర్టులో లైవ్ హ్యాకింగ్ డెమో ఇస్తున్న నిజమైన వీడియో కాదు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికాము. అయితే, ఈ సెర్చ్ ద్వారా, ఇమ్మడి రవి ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు, జడ్జి ముందు హ్యాకింగ్ డెమో ఇటీవల ఇచ్చాడు అని చెప్తూ మాకు ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు. అలాగే, వైరల్ వీడియో గురించి కూడా మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఇక ఈ వీడియో ఉన్న పోస్టుల్లో కొందరు యూజర్లు, ఇది AI(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వీడియో అని చెప్పి కామెంట్ చేయడం మేము గమనించాము.
అలాగే, వీడియో యొక్క మొదటి ఫ్రేములో జడ్జి ముఖం వింతగా ఉండటం, డెమో ఇస్తున్న వ్యక్తి యొక్క కాళ్లు అసలే కనపడకపోవడం వంటి కొన్ని అవకతవకలను మేము గమనించాము. AI ఉపయోగించి తయారు చేసిన వీడియోలలో ఇటువంటి అవకతవకలు సహజంగా ఉంటూ ఉంటాయి. వీటి వల్ల, ఇది AI-జనరేటెడ్ వీడియో అయి ఉండవచ్చు అనే అనుమానం మాకు కలిగింది.
ఇక ఈ వీడియో AI-జనరేటెడ్ ఆ కాదా అని తెలుసుకోవడానికి, డీప్‌ఫేక్-ఓ-మీటర్ అనే AI కంటెంట్ డిటెక్షన్ టూల్ ఉపయోగించి చూసాము. ఇది పూర్తిగా AI ఉఆయోగించి తయారు చేసిన వీడియో అని డీప్‌ఫేక్-ఓ-మీటర్ యొక్క డిటెక్టర్‌లు తెలిపాయి.
ఇక ఈ వీడియో గురించి మరిన్ని వివరాల కోసం, అందులోని కీఫ్రేమ్‌లను ఉపయోగించి ఇంటర్నెట్‌లో ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియో మాకు ‘prajayhoney’ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంటులో లభించింది. దీన్ని తను 23 నవంబర్ 2025న అప్లోడ్ చేశాడు. ఈ వీడియో వెనుక ఉన్న వివరాల కోసం Prajayను ఫ్యాక్ట్‌లీ సప్రదించగా, దీన్ని తను AI-ఉపయోగించి తయారు చేశాడని చెప్పాడు. తను విశాఖపట్నంలో ఒక AI కంపెనీలో పని చేస్తాడని, ఈ వీడియోను తన కంపెనీ యొక్క సొంత LLM Model ఉపయోగించి తయారు చేశాడని Prajay ఫ్యాక్ట్‌లీకి తెలిపాడు.
ఇదే విషయాన్ని వెరిఫై చేయడానికి మేము హైవ్ అనే AI కంటెంట్ డిటెక్షన్ టూల్‌లో తన వీడియోని రన్ చేసి చూసాం. ఇది AI-జనరేట్ వీడియో అని హైవ్ గుర్తించింది.
చివరగా, ఐబొమ్మ రవి కోర్టులో లైవ్ హ్యాకింగ్ డెమో చేసి చూపిస్తున్న దృశ్యాలని చెప్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు.