‘ఆడ పులికి పురుడు పోసిన డాక్టర్లు, మగ పులి తండ్రొత్సాహం..’ అని చెప్తూ, ఒక ఇద్దరు వ్యక్తులు ఒక ఆడపులికి పురుడు పోస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: ఒక ఆడపులికి ఇద్దరు డాక్టర్లు పురుడు పోస్తున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిన వీడియో. AI టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసిన వీడియోలను అప్లోడ్ చేసే ‘యానిమల్స్ అండ్ హీరోస్’ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తయారు చేసిన వీడియో ఇది. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ వీడియో గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి అందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, దీని అసలు వెర్షన్ మాకు లభించింది. అనిమల్స్ అండ్ హీరోస్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ వీడియోను అప్లోడ్ చేశారు.
అయితే, ఈ వీడియో వివరణలో, ఈ వీడియో నిజమైనది కాదు అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసింది అని వీరు పేర్కొన్నారు. నిజ జీవితంలో వన్యప్రాణులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని ఇందులో వీరు పేర్కొన్నారు. ఇదే వీడియోను వారు తమ ఫేస్‌బుక్ పేజీలో కూడా అప్లోడ్ చేశారు.
వైరల్ వీడియోని సరిగ్గా పరిశీలిస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిన దృశ్యాలలో ఉండే చాలా తప్పులు మనకు కనిపిస్తాయి. వాళ్ల చేతులకి ఉన్న వేళ్లు, మధ్యమధ్యలో మాయం అవడం, ముఖాలు రూపాంతరం చెందుతున్నట్లు అవడం, వేళ్లు టవల్ మధ్యలో నుంచి వస్తున్నట్లు కనిపించడం, ఇవన్నీ AI-జనరేటెడ్ వీడియోలలో ఉండే తప్పులు.
అనిమల్స్ అండ్ హీరోస్ వాళ్లు తమ యూట్యూబ్ ఛానల్, ఫేస్‌బుక్ పేజీలో వైరల్ వీడియో వంటి చాలా AI-జనరేటెడ్ వీడియోలను పోస్ట్ చేశారు. వీటిని మీరు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిన వీడియోని, ఒక ఆడపులికి పురుడు పోసిన పోలీస్ డాక్టర్ల నిజమైన వీడియో అని చెప్పి తప్పుగా షేర్ చేస్తున్నారు.