ముస్లిం మతానికి చెందిన తండ్రి తన కూతురిని వివాహం చేసుకున్నాడని చెప్తూ ఒక స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన సంఘటనగా షేర్ చేస్తున్నారు

ముస్లిం మతానికి చెందిన ఓ తండ్రి తన కూతురిని వివాహం చేసుకున్నాడని ఒప్పుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). దీన్ని ఒక నిజమైన సంఘటనలా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ముస్లిం మతానికి చెందిన ఓ తండ్రి తన కూతురిని వివాహం చేసుకున్నాడని ఒప్పుకుంటున్న వీడియో

ఫాక్ట్(నిజం): ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, నిజమైన సంఘటనను చూపించదు. ఈ వీడియోను రాజ్ ఠాకూర్ అనే వీడియో క్రియేటర్ తన ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో 05 మార్చి 2025న అప్‌లోడ్ చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ వీడియోలోని కీ ఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో (ఆర్కైవ్ లింక్) 06 మార్చి 2025న రాజ్ ఠాకూర్ (@official_rajthakur__) తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసినట్లు మేము గుర్తించాము. ఈ పోస్ట్ వివరణలో ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని, ఈ వీడియో నిజమైన సంఘటనను చూపించదని పేర్కొన్నారు. అలాగే, ఈ వైరల్ వీడియో యొక్క పూర్తి నిడివి గల వీడియో రాజ్ ఠాకూర్ ఫేస్‌బుక్ పేజీలో అందుబాటులో ఉందని వివరణలో పేర్కొన్నారు. ఇదే వైరల్  వీడియోను 05 మార్చి 2025న రాజ్ ఠాకూర్, అతని యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ఇదే వివరణతో అప్‌లోడ్ చేశాడు.

రాజ్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ని పరిశీలించినప్పుడు అతను ఢిల్లీకి చెందిన వీడియో క్రియేటర్ అని మాకు తెలిసింది.

రాజ్ ఠాకూర్ ఫేస్‌బుక్ హ్యాండిల్‌ లింక్‌ను అతని ఇన్‌స్టాగ్రామ్ బయోలో మేము కనుగొన్నాము. అతని ఫేస్‌బుక్ హ్యాండిల్‌ను పరిశీలించగా, వైరల్ వీడియో యొక్క అధిక నిడివి గల వీడియో (ఆర్కైవ్ లింక్) మాకు లభించింది.

చివరిగా, ముస్లిం మతానికి చెందిన తండ్రి తన కూతురిని వివాహం చేసుకున్నాడని చెప్తూ ఒక స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన సంఘటనగా షేర్ చేస్తున్నారు.