సెలూన్‌లో ఒక కస్టమర్ మెడని మసాజ్ సమయంలో విరిచాక, ఆ కస్టమర్ అమాంతం తన కుర్చీలో పడిపోయి చనిపోయినట్టుగా ఉన్న వీడియో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను కొందరు యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “ఎవరు కూడా బార్బర్ షాప్ కి వెళ్లి ఎక్కువగా మసాజ్ చేయించుకోకండి. ఎందుకంటే పై వీడియో లో మనిషి చనిపోయాడు.. “అని క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: సెలూన్‌లో మసాజ్ చేయించుకున్న తర్వాత మరణించిన వ్యక్తి. ఆ సంఘటనకి సంబంధించిన CCTV దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది.
ఫ్యాక్ట్(నిజం): ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఇలాంటి ఫిక్షనల్ వీడియోలని తయారు చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేసే 3RD EYE అనే యూట్యూబ్ ఛానెల్ వారు ఈ వీడియోను తయారు చేశారు. కావున, వైరల్ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలను వెరిఫై చేస్తున్న క్రమంలో మాకు ఇదే వీడియో కలిగిన మరిన్ని సోషల్ మీడియా పోస్టులు మాకు దొరికాయి. వాటిలో ‘Watch more original videos by: Sanjjanaa Galrani’ అనే ఒక ట్యాగ్ ఉండటం మేము గమనించాం.
సంజన గల్రానీ చిత్ర పరిశ్రమలో నటిగా పని చేస్తుంటారు. వైరల్ అవుతున్న వీడియో తన పేజీలో ఉందేమో అని చూడటానికి, నటి సంజన ఫేస్‌బుక్ పేజిలో ఆ వీడియో కోసం వెతకగా, దీన్ని తను నవంబర్ 7వ తారీఖున అప్లోడ్ చేశారు అని మాకు తెలిసింది.
కానీ ఈ వీడియో యొక్క వివరణలో, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని, దీన్ని కేవలం ప్రజలలో అవగాహన కల్పించడానికి తయారు చేశారని చెప్తున్న ఒక వివరణ ఉండటం మేము గమనించాము. ఇదే వివరణ మనకి ఈ వీడియో యొక్క చివర్లో కూడా కనిపిస్తుంది. దీన్ని బట్టి, ఈ వీడియోలోని సంఘటన నిజంగా జరగలేదు అని మనకి స్పష్టం అవుతుంది.
అదనంగా, స్క్రిప్టెడ్ వీడియోలని తయారు చేసి యూట్యూబులో అప్లోడ్ చేసే ‘3RD EYE’ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా మాకు ఇదే వీడియో దొరికింది (ఆర్కైవ్డ్ వెర్షన్). ఈ వీడియోలో, ఇంకా వీడియో వివరణలో కూడా ‘వీడియో కేవలం వినోదం కోసం మరియు ప్రజలలో అవగాహన తీసుకురావడం కోసం తయారు చేశారు’ అని ఉంది.
3rd eye మరియు సంజన అప్లోడ్ చేసిన ఫిక్షనల్ వీడియోలను, గతంలో కూడా నిజమైన సంఘటనలకి చెందిన వీడియోలు అని సోషల్ మీడియాలో కొందరు షేర్ చేయగా, అవి నిజమైన సంఘటనలకి చెందిన వీడియోలు కావు అని చెప్తూ మేము కథనాలని ప్రచురించాము. వాటిని మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఇదిలా ఉంచితే, మసాజ్ చేయించుకునేటప్పుడు మెడను విరిపించికోవడం వల్ల నరాలు దెబ్బతిని, పక్షవాతం రావచ్చు అని చెప్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా వారు 2017లో ఒక వార్తా కథనాన్ని ప్రచురించారు. ఇలా మసాజ్ చేయించుకున్న తర్వాత అజయ్ కుమార్ అనే ఒక వ్యక్తి యొక్క నరాలు దెబ్బతిని, తను వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. “హెయిర్‌కట్ తర్వాత బార్బర్‌లు ఆచారబద్ధంగా చేసే మెడ మసాజ్ మరియు మెడను విరచడం వళ్ల, మెడ కీళ్ళు మరియు చుట్టుపక్కల ఉన్న టిష్యులు, కండరాలు లేదా నరాలకు దీర్ఘకాలిక నష్టం కలగవచ్చు….” అని తనకు చికిత్స ఇచ్చిన డాక్టర్ ఆనంద్ జైస్వాల్ చెప్పారు.
ఇలాంటి మసాజ్ తర్వాత మెడను విరిపించుకోవడం వల్ల “ఆర్టీరియల్ డైసెక్షన్” అనే కండిషన్ మనలో ఏర్పడే ప్రమాదం ఉంది అని వివరిస్తూ, రీసెర్చ్ గేట్ వెబ్సైటులో “సునీల్ మున్షి’ అనే ఫిజిషియన్ ఒక కాన్ఫరెన్స్ పేపర్ అప్లోడ్ చేశారు. అలాగే, సెప్టెంబర్ 2024లో కర్ణాటకలోని బళ్లారిలో ఒక బార్బర్, ఒక 30 ఏళ్ల వ్యక్తికి, తన షాపులో హెడ్ మసాజ్ చేసి మెడను తిప్పాడు. దీని కారణంగా తనకు హార్ట్ స్ట్రోక్ వచ్చి రెండు నెలలు ఆస్పత్రి పాలయ్యే పరిస్థితి వచ్చింది (ఇక్కడ మరియు ఇక్కడ).
ఈ ఉదాహరణలను బట్టి, ఇలా హెడ్ మసాజ్ సమయంలో మెడ విరిపించుకోవడం వల్ల ప్రమాదం ఉంది అని మనకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉందాం. బార్బర్ షాపులో ఇలాంటి మసాజులు చేయించుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులు గురించి తెలుసుకోవడానికి మీ డాక్టర్‌ని సంప్రదించండి.
చివరిగా, ఒక స్క్రిప్టెడ్ వీడియోను షేర్ చేస్తూ, సెలూన్‌లో మసాజ్ సమయంలో కస్టమర్ మెడను తిప్పడం వల్ల ఆ వ్యక్తి మరణించిన సంఘటన యొక్క నిజమైన దృశ్యాలు అని తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారు.