‘లిఫ్ట్ అడిగి మధ్యలో దిగి డబ్బులు అడుగుతారు ఇవ్వను అంటే నాతో తప్పుగా ప్రవర్తించావ్ అని చెప్తా అని బెదిరిస్తారు…’అని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) వైరల్ అవుతోంది. ఇందులో ఒక అమ్మాయి బైక్ నడుపుతున్న ఒక వ్యక్తిని రోడ్డు మీద లిఫ్ట్ అడిగి, కాసేపటి తర్వాత బైక్ ఆపి ఆ అమ్మాయి అతన్ని డబ్బులు అడగడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. తనతో ఆ బైకర్ తప్పుగా ప్రవర్తించాడు అని ఈ అమ్మాయి ఈ వీడియోలో చెప్పడం కూడా మనం చూడవచ్చు. ఈ వీడియోని షేర్ చేస్తున్న యూజర్లు, ఇలాంటి సంఘటనలు హైదరాబాదులో కూడా జరుగుతున్నాయి, జాగ్రత్త అని చెప్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: బైక్ నడుపుతున్న వ్యక్తిని ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగి మధ్యలో దిగి, తనతో ఆ బైకర్ తప్పుగా ప్రవర్తించాడు అని నిందిస్తూ డబ్బులు డిమాండ్ చేసిన సంఘటనకు సంబంధించిన వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, నిజంగా జరిగిన సంఘటన కాదు. దీన్ని ‘Vinurc’ అనే యూట్యూబర్ వినోదం కోసం (entertainment purposes) తయారు చేశాడు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్‌ను వెరిఫై చేయడానికి, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, హైదరాబాదులో డిసెంబరు 2024లో ఇలా బైక్ పైన వెళ్లే వారిని లిఫ్ట్ అడిగి వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు అని రిపోర్ట్ చేసిన కొన్ని వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ) లభించాయి. వీటితో పాటు గతంలో లిఫ్ట్ అడిగి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన సంఘటనలు జరిగాయి అని రిపోర్ట్ చేసిన వార్తా కథనాలు కూడా మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ). అయితే, వైరల్ వీడియో గురించి మాత్రం ఎక్కడా ఏ ఆధారాలూ లభించలేదు.
ఈ వీడియో గరించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ వీడియో యొక్క ఒరిజినల్ వెర్షన్ మాకు యుట్యూబ్‌లో లభించింది. ఈ వీడియోలోని విజువల్స్ 3:18 టైమ్ స్టాంప్ట్ దగ్గర నుంచి వైరల్ వీడియోతో మ్యాచ్ అవుతున్నాయి.
దీన్ని ‘Vinurc’ అనే ఛానల్ వారు 23 జూన్ 2023న ‘cute girl drop scame / KTM ka accident / Chapri biker and uski girlfriend se hui bhasad’ అనే టైటిల్‌తో అప్లోడ్ చేశారు. అయితే ఇది కేవలం వినోదం కోసం తయారు చేసిన వీడియో అని, ఈ వీడియో యొక్క వివరణలో ఉంది. అంటే ఇది నిజంగా జరిగిన సంఘటన కాదు, కేవలం “Entertainmen” కోసం తయారు చేయబడిన ఒక స్క్రిప్టెడ్ వీడియో.
‘Vinurc’ ఛానల్‌లో ఇటువంటి చాలా స్క్రిప్టెడ్ వీడియోలు ఉన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ ఛానల్ యొక్క వివరణలో Vinurc ఒక వ్లాగర్ అని పేర్కొన్నారు.
చివరగా, బైక్ నడుపుతున్న వ్యక్తిని ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగి, అతను తనతో తప్పుగా ప్రవర్తించాడు అని అంటూ డబ్బులు డిమాండ్ చేసిన నిజమైన సంఘటన అని ఒక స్క్రిప్టెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు.