ఒక ముస్లిం వ్యక్తి హిందువులకు సంబంధించిన కాషాయ రంగు జెండాను తొలగిస్తున్న దృశ్యాలంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఒక ముస్లిం వ్యక్తి ఒక ఇంటిపై ఉన్న కాషాయ జెండాను తీసి విసిరేయడం మనం చూడవచ్చు. దీన్ని ఒక నిజమైన సంఘటనలా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఒక ముస్లిం వ్యక్తి హిందువులకు సంబంధించిన కాషాయ రంగు జెండాను తొలగిస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, నిజమైన సంఘటనను చూపించదు. ఈ వీడియోను హిమాన్షు జాతవ్ అనే వీడియో క్రియేటర్ రూపొందించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ వీడియోలోని కీ ఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను X లో అనేక మంది వినియోగదారులు షేర్ చేసినట్లు మేము గుర్తించాము (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఒక పోస్ట్ వివరణలో ఇది స్క్రిప్టెడ్ వీడియో అని, వీడియోలో ఉన్నవారంతా హిందువులే అని పేర్కొన్నారు. ఆ యూజర్ వారిలో ఒకరిని ‘హేమరాజ్ ఠాకూర్’ అని గుర్తించారు. అతను స్క్రిప్టెడ్ వీడియోలు రూపొందిస్తాడని పేర్కొంటూ అతని ఫేస్‌బుక్ ప్రొఫైల్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశాడు.
దీనిని ఆధారంగా, మేము ‘హేమరాజ్ ఠాకూర్’ యొక్క ఫేస్‌బుక్ పేజీని కనుగొన్నాము. హేమరాజ్ ఠాకూర్ ప్రొఫైల్‌ను పరిశీలించినప్పుడు, అతను ఢిల్లీకి చెందిన వీడియో సృష్టికర్త అని, అతను ఇలాంటి స్క్రిప్టెడ్ వీడియోలను తయారు చేసి పోస్ట్ చేస్తాడని కూడా మేము గమనించాము (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).
అతను తన ఫేస్‌బుక్ ప్రొఫైల్ పేరును మార్చి ఇప్పుడు “హేమరాజ్ ఠాకూర్”గా (హిమాన్షు జాతవ్) పెట్టుకున్నట్లు మాకు తెలిసింది. 25 మార్చి 2024న తన వీడియోలు వినోద ప్రయోజనాల కోసం మాత్రమేనని, వాటిలో ఉన్న పాత్రలు నిజమైనవి కావని పేర్కొంటూ ఒక క్లారిఫికేషన్ పోస్ట్ చేశారు.
వైరల్ వీడియోలో మహిళను ‘రక్షిస్తున్న’ వ్యక్తి ఇతర స్క్రిప్టెడ్ వీడియోల్లో కూడా నటించినట్లు మేము గుర్తించాము.
చివరిగా, ఒక ముస్లిం వ్యక్తి హిందువులకు సంబంధించిన కాషాయ రంగు జెండాను తొలగిస్తున్నట్లు చూపిస్తున్న స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన సంఘటనగా షేర్ చేస్తున్నారు