మార్కెట్లోకి ఒక కొత్త హలాల్ షాంపూ వచ్చింది అనే క్లెయిమ్‌తో ఒక పేరడీ వీడియోలోని స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తున్నారు

హిజాబ్ ధరించిన ఒక మహిళ తలకు షాంపూ అంటించుకుంటున్న ఒక ఫోటోతో పాటు రీజాయిస్-ఉంటుక్ హిజాబ్ అనే షాంపూ ఫోటోలు ఉన్న గ్రాఫిక్ (ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మార్కెట్లోకి వచ్చిన కొత్త హాలల్ షాంపూ హిజాబ్ వేసుకొని తల స్నానం చేసిన శిరోజాలు దట్టముగా పెరుగును,’ అని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియా యూజర్లు దీన్ని షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: హిజాబ్ వేసుకుని తల స్నానం చేసే షాంపూని ఈ గ్రాఫిక్ చూపిస్తుంది.

ఫ్యాక్ట్(నిజం): ఈ గ్రాఫిక్‌ను MGAG అనే మీమ్ పేజి వాళ్ళు తయారు చేశారు. హిజాబ్ ధరించే వాళ్ల కోసం మార్కెట్లో ఉన్న రీజయిస్ షాంపూ ప్రోడక్ట్ కవర్, మలేషియాలోని ‘MTAS ప్రొడక్షన్’ అనే మీడియా నిర్మాణ సంస్థ చేసిన ఒక పాత సన్‌సిల్క్ హెయిర్ షాంపూ ప్రకటన యొక్క స్పూఫ్(ప్యారడీ) వీడియోలోని ఒక స్క్రీన్‌షాట్‌ను కలిపి, ఈ మీమ్ తయారు చేశారు. కావున, ఈ పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను వెరిఫై చేయడానికి, మేము ఇంటర్నెట్లో ఒక కీ వర్డ్ సెర్చ్ చేశాము.  దీని ఫలితంగా ఏప్రిల్ 2017లో ‘MTAS ప్రొడక్షన్’ వారు Facebook మరియు YouTubeలో అప్‌లోడ్ చేసిన ఒక వీడియో లభించింది. వైరల్ గ్రాఫిక్‌లో కింద భాగంలో ఉన్న మహిళ హిజాబ్ వేసుకుని తలకు షాంపూ పోసుకుంటున్న ఫోటోని స్క్రీంషాట్ లాగ ఈ వైరల్ వీడియోలో వాడారు.

మలేషియా అధికారిక భాష అయిన మలయ్‌లో ఉన్న ఈ వీడియో శీర్షికను తెలుగులోకి అనువదించగా, దీనిలో ‘90ల పిల్లలకు మాత్రమే ఈ రకమైన ప్రకటనలు తెలుసు’ అని ఉంది.

‘MTAS ప్రొడక్షన్’ యొక్క ఫేస్‌బుక్ , YouTube ప్రొఫైల్‌లను పరిశీలించిన తర్వాత, ఇది ఒక ‘బ్రాడ్‌కాస్టింగ్ మరియు మీడియా ప్రొడక్షన్ కంపెనీ’ అని తెలిసింది. వీళ్లు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో స్క్రిప్ట్ చేయబడిన వీడియోలు మరియు పోస్ట్‌లను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు అని  మాకు తెలిసింది.

దీని గురించి మరింత వెతకగా, ఈ వీడియోపై 2017లో వచ్చిన కొన్ని వార్తా కథనాలు మాకు లభించాయి. అప్పట్లో, ఈ వీడియోను నిజమైన వీడియో అని అందరూ తప్పుగా అనుకోవడం వల్ల వివాదం రేకొంది, వాస్తవానికి ఇది ఒక పేరడీ స్కెచ్.

మలేషియా వార్తా వెబ్‌సైట్, CIlisos ప్రకారం, ఈ వీడియోను ‘MTAS ప్రొడక్షన్’ వారు ఒక పాత సన్‌సిల్క్ షాంపూ ప్రకటన యొక్క స్పూఫ్/అనుకరణగా రూపొందించారు.

ఈ వీడియోను ‘MTAS-Mr The All Shared Production’ వారు ఎస్కార్వ్స్ అనే స్థానిక హిజాబ్ బ్రాండ్‌ను ప్రోత్సహించడానికి తయారు చేశారని కొన్ని కథనాలు ఉన్నాయి.

అలాగే, వైరల్ అవుతున్న ఈ గ్రాఫిక్‌ను MGAG అనే మీమ్ పేజి వాళ్లు 2018లో తయారు చేసి తమ ఫేస్‌బుక్ పేజిలో అప్లోడ్ చేశారు(ఆర్కైవ్ లింక్) అని మాకు ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా తెలిసింది. MGAG అనేది ఒక మలేషియాకి చెందిన ఒక మీమ్ సంస్థం. 

ఇదిలా ఉండగా, ఇండోనేషియా దేశంలో హిజాబ్ ధరించే మహిళలు వాడుకోవటానికి రీజయిస్ అనే బ్రాండ్ వారు ఒక షాంపూ తయారు చేస్తారు అని మాకు మా పరిశోధనలో తెలిసింది(ఇక్కడ, ఇక్కడ). దానికి సంబంధించిన బ్రాండ్ కవర్ ఫోటోనే(ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) వైరల్ అవుతున్న గ్రాఫిక్‌లో ఉంది. దీనిబట్టి ఒక పేరడీ వీడియోకి ఒక షాంపూ కవర్ ఫొటోని జోడించి తయారు చేసిన ఒక మీమ్ గ్రాఫిక్‌ను, హిజాబ్ వేసుకుని తలపై రాసుకునే ఒక కొత్త హలాల్ షాంపూ మార్కెట్లోకి వచ్చింది అని ఒక తప్పుడు క్లెయిమ్ చేస్తున్నారు అని మనకి స్పష్టం అవుతుంది.

చివరిగా, మార్కెట్లోకి ఒక కొత్త హలాల్ షాంపూ వచ్చింది అనే క్లేయిమ్‌తో ఒక పేరడీ వీడియోలోని స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తున్నారు.