ఒక కమెడియన్‌ రూపొందించిన వ్యంగ్యపు వీడియోను బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ పంపిణీ చేసిన శానిటరీ ప్యాడ్ల దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు

బీహార్‌ 2025 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఫోటో ముద్రించిన శానిటరీ ప్యాడ్‌లు పంచింది అని చెబుతూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ పంచిన శానిటరీ ప్యాడ్లపై రాహుల్ గాంధీ ఫోటో ముద్రించారు.

ఫాక్ట్(నిజం): ఇది ఒక వ్యంగ్యపు వీడియో. దీనిని రతన్ రంజన్ అనే కమెడియన్‌ రూపొందించాడు. కాంగ్రెస్ పార్టీ పంపిణీ చేసిన ప్యాడ్ల ప్యాకెట్లపై రాహుల్, ప్రియాంక గాంధీల ఫోటోలు ఉన్నా, ప్యాడ్లపై ఎలాంటి ఫోటోలు ముద్రించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ విషయానికి సంబంధించిన సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, 04 జూలై 2025న, కాంగ్రెస్ పార్టీ ‘ప్రియదర్శిని ఉడాన్ యోజన’లో భాగంగా బీహార్‌లోని మహిళలకు ఐదు లక్షల శానిటరీ ప్యాడ్‌లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఫోటోలు ముద్రించబడి ఉన్నాయి, అయితే, ప్యాకెట్లపై రాహుల్ గాంధీ ఫోటో ఉండటంపై NDA పక్షాలు  అభ్యంతరం వ్యక్తం చేశాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) .

ఇకపోతే, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను రతన్ రంజన్ అనే కమెడియన్‌ 05 జూలై 2025న తన X హ్యాండిల్‌లో పోస్ట్ చేశాడు అని మేము కనుగొన్నాము. కాంగ్రెస్ పార్టీ శానిటరీ ప్యాడ్‌లను పంపిణీ చేస్తుందని ప్రకటించిన నేపథ్యంలో రతన్ రంజన్ ఈ కార్యక్రమంపై  ఒక వ్యంగ్యపు వీడియోను రూపొందించాడు (ఇక్కడ & ఇక్కడ).

A2Z NEWS TV’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్ రంజన్ ఈ వీడియో తనే చేసానని, రాహుల్ గాంధీ ఫోటో ప్యాడ్‌పైన ముద్రించలేదని అంగీకరించాడు. అలాగే ఈ ఇంటర్వ్యూలో లోపల అతను అతికించిన రాహుల్ గాంధీ ఫోటోను చూపించాడు. మరో ఇంటర్వ్యూలో ఈ వీడియోపై తాను క్షమాపణ చెప్పబోనని, ఇది కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఎజెండాపై వేసిన వ్యంగ్యపు వీడియో అని అతను పేర్కొన్నాడు.

రంజన్ వీడియోలో కనిపించే ప్యాడ్ ప్యాకెట్ నారింజ (ఆరంజ్) రంగులో ఉంది. అయితే, కాంగ్రెస్ పార్టీ ‘మా బహిన్ మాన్ యోజన‘ కింద పంపిణీ చేసిన ప్యాడ్‌లు గులాబీ (పింక్) రంగు బాక్స్ లో ఉన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

ఈ వీడియో చేసిన రతన్ రంజన్ పై తెలంగాణ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదయ్యాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ ).

ఈ వీడియోను నకిలీ అని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. రాహుల్ గాంధీ ఫోటో ప్యాడ్‌పై ముద్రించలేదని స్పష్టం చేస్తూ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కా లాంబా అసలైన ప్యాడ్‌ను చూపిస్తూ ఒక వీడియో షేర్ చేశారు.

చివరిగా, ఒక కమెడియన్‌ రూపొందించిన వ్యంగ్యపు వీడియోను బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ పంపిణీ చేసిన శానిటరీ ప్యాడ్ల దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.