నర్మదా నదిలో శాస్త్రానికి మించిన ఒక అద్భుతం ఉంది అని చెప్తూ, ఒక రాయి మీద మూడు గుండ్రని రాళ్లు ఏ ఆధారం లేకుండా నిలబడి ఉన్న వీడియోని (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ, ‘వరదల సమయంలో కూడా రాళ్లు స్థిరంగా ఉంటాయి. ఇది నమ్మశక్యం కాని అద్భుతంగా పరిగణించబడుతుంది..’ అని క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: వైరల్ వీడియోలో కనిపిస్తున్నది నర్మదా నదిలో ఉన్న ఒక సహజసిద్ధమైన రాక్ ఫార్మేషన్ (రాతి నిర్మాణం).
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియోలో ఉన్న రాళ్లు సహజసిద్ధంగా అలా ఒక దాని పైన ఒకటి నిలబడలేదు, వీటిని మైకేల్ గ్రాబ్ అనే వ్యక్తి పేర్చాడు. ఇతను ఒక బ్యాలెన్స్ ఆర్టిస్ట్ (రాళ్లను ఒకదానిపై ఒకటి బాలెన్స్ చేసే కళాకారుడు). అంతే కాదు, ఇది నర్మదా నదిలో లేదు, ఈ వీడియోని మైకేల్ గ్రాబ్ అమెరికాలోని కొలరాడోలో తీసాడు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ముందుగా, వైరల్ వీడియో వెనుక ఉన్న నిజానిజాలను తెలుసుకోవడానికి, అందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి, ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా వైరల్ వీడియోలో ఉన్న రాక్ ఫార్మేషన్లను పోలి ఉన్న కొన్ని వేరే ఫోటోలు(ఇక్కడ మరియు ఇక్కడ) మాకు ఇంటర్నెట్లో లభించాయి/ ఈ ఫోటోల పైన ‘GravityGlue.com’ అని ఒక వాటర్ మార్క్ ఉంది.
GravityGlue.comలో వైరల్ వీడియోలో ఉన్న రాళ్ల వంటి చాలా రాక్ ఫార్మేషన్ల ఫోటోలు మరియు వీడియోలు ఉన్నాయి. వీటిని మైకేల్ గ్రాబ్ అనే బ్యాలెన్స్ ఆర్టిస్ట్ అనగా రాళ్లను బ్యాలెన్స్ చేసే కళాకారుడు తయారు చేశాడు.
తను ఈ రాళ్లను ఒకదానిపై ఒకటి ఎలా పేరుస్తాడో వివరిస్తూ(demonstrate చేస్తూ)మైకేల్ గ్రాబ్ ఈ వెబ్సైటులో కొన్ని వీడియోలు కూడా అప్లోడ్ చేశాడు.
ఈ సైటులో ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజీ లింక్ ఓపెన్ చేసి చూడగా, వైరల్ అవుతున్న వీడియో యొక్క పూర్తి వెర్షన్ మాకు అందులో దొరికింది. దీని వివరణలో ‘Stone Balance by Michael Grab’ అని ఉంది. దీని బట్టి ఇది సహజంగా ఏర్పడిన రాక్ ఫార్మేషన్ కాదు అని మనకి స్పష్టం అవుతుంది.
అలాగే ఇతను ఈ రాళ్ల యొక్క ఫొటోని ఇన్స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేస్తూ, అమెరికాలో ఉన్న కోలోరాడోలో ఉన్న బౌల్డర్ అనే ప్రదేశాన్ని ట్యాగ్ చేశాడు. అంటే వైరల్ పోస్టులో చెప్తున్నట్టు ఇది నర్మదా నదిలో తీసిన వీడియో కాదు, అమెరికాలో తీసిన వీడియో.
అలాగే, నర్మదా నదిలో ఇటువంటి రాక్ ఫార్మేషన్ ఏమైనా ఉందా అని ఇంటర్నెట్లో వెతికితే, మాకు ఎటువంటి వార్తా కథనాలు కానీ, వేరే ఆధారాలు గానీ లభించలేదు.
చివరిగా, అమెరికాలో మైకేల్ గ్రాబ్ అనే కళాకారుడు నిర్మించిన రాతి నిర్మాణాన్ని, నర్మదా నదిలో సహజంగా ఏర్పడిన నిర్మాణం అని తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారు.