వక్ఫ్ సవరణ చట్టం, 2025ని వ్యతిరేకిస్తూ, ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్లోని చాలా చోట్ల నిరసనలు జరిగాయి. ముర్షిదాబాద్ జిల్లాలో ఈ ఆందోళనులు హింసాత్మకంగా మారి, గొడవలు, అల్లర్లు కూడా జరిగాయని వార్తా కథనాలు పేర్కొన్నాయి(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). వార్తా కథనాల ప్రకారం( ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన ఈ గొడవల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, ఇందులో చందన్ దాస్, హరగోబింద్ దాస్ అనే ఇద్దరు హిందువులు ఒక మూక దాడిలో మరణించగా, ఒక ముస్లిం వ్యక్తి పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. ముర్షిదాబాద్ జిల్లాలో జరుగుతున్న ఈ హింసను తప్పించుకోవడానికి వందలాది హిందువులు తమ ఇళ్లను వదిలి, ఆశ్రయం పొందడానికి మాల్డా నగరానికి చేరుకున్నారు(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). పరస్థితిని అదుపులోకి తీసుకురావడానికి జంగిపూర్‌లో కేంద్ర బలగాలని మోహరించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది(ఇక్కడ, ఇక్కడ). ఈ అల్లర్లకు సంబంధించి సుమారు 150 పైగా వ్యక్తులు అరెస్ట్ అయ్యారు (ఇక్కడ, ఇక్కడ).
ఈ నేపథ్యంలో ‘చేతిలో మారణాయుధంతో.. బెంగాల్లో స్వైరవిహారం చేస్తోన్న గ్రవాది’ అని క్లెయిమ్ చేస్తూ ఒక వ్యక్తి తన చేతిలో పిస్టల్ పట్టుకుని రోడ్డు పై నడుస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: పశ్చిమ బెంగాల్‌లోని రోడ్లపై మారణాయుధం పట్టుకుని తిరుగుత్న వ్యక్తిని చూపిస్తున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో జూలై 2024 నుంచి ఇంటర్నెట్లో ఉంది. బంగ్లాదేశ్‌లో జూలై 2024లో జరిగిన ఉద్యోగ ‘కోటా నిరసనల’ సమయంలో వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి చిట్టగాంగ్‌లోని మురాదపూర్ ఏరియాలో ఈ విధంగా పిస్టల్ పట్టుకొని రోడ్డుపై తిరుగుతూ కనిపించాడు. కాబట్టి, వైరల్ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియో ఉన్న జూలై 2024 నాటి కొన్ని యూట్యూబ్ పోస్టులు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). బంగ్లాదేశీ మీడియా సంస్థలు అయిన ‘Bangla Tribune,’ ‘Channel 24,’ ‘SOMOY TV’లు ఈ వీడియోని తమ అధికారిక వెరిఫైడ్ యూట్యూబ్ ఛానల్‌లలో అప్లోడ్ చేశారు.
ఇక ఈ వీడియో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ వీడియో గురించి జూలై 2024లో ప్రచురితమైన బంగ్లాదేశీ వార్తా కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ఈ సంఘటన, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో జరిగిన కోటా నిరసనల (ఇక్కడ, ఇక్కడ) సమయంలో జరిగింది.
16 జూలై 2024న ఈ నిరసనకారులకు పోలీస్,ఛాత్ర లీగ్, జుబో లీగ్, స్వేచ్ఛ సెబక్ లీగ్ నాయకులకి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంలో బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లోని ఉన్న మురాదపూర్ ఏరియాలో వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఒక పిస్టల్ పట్టుకుని తిరుగుతూ, నిరసనకారులపై ఫైరింగ్ జరిపాడని వార్తా కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ వ్యక్తి పేరు ఫిరోజ్ ఆలం అని ‘Protidiner Bangladesh’ తమ కథనంలో పేర్కొంది.
అలాగే ఈ సంఘటనకి చెందిన వీడియోలలో కనిపిస్తున్న బాటా షో రూమ్ పక్కన నీలి రంగు బోర్డుపై ‘রাজা গেষ্ট হাউস'(Raja Guest House) అని ఉంది. దీని ఆధారంగా, ఈ వీడియోని తీసిన స్థలాన్ని మేము గూగుల్ మ్యాప్స్ సహాయంతో కనుగొన్నాము. ఈ వీడియోను చిట్టగాంగ్‌లోని ‘70 Hathazari Rd’ దగ్గర ఉన్న బాటా షోరూం, ‘ICB Islamic Bank Ltd.’ సమీపంలో తీశారు.
అదనంగా, వైరల్ క్లెయిమ్ ఫేక్ అని, ఈ సంఘటన జూలై 2024లో బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో జరిగింది అని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సైబర్ క్రైమ్ వింగ్ సోషల్ మీడియా ద్వారా ఒక వివరణ ఇచ్చింది (ఇక్కడ, ఇక్కడ)
చివరగా, పశ్చిమ బెంగాల్‌లోని రోడ్లపై మారణాయుధం పట్టుకుని ఒక వ్యక్తి తిరుగుతున్న వీడియో అని జూలై 2024లో బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో తీసిన వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు