జూలై 2020లో జమ్మూ కశ్మీర్‌లోని సోపోర్‌లో జరిగిన ఓ ఉగ్రదాడికి సంబంధించిన వీడియోను ఏప్రిల్ 2025లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

22 ఏప్రిల్ 2025న, శ్రీనగర్‌కు దక్షిణంగా సుమారు 100 కి.మీ. దూరంలో ఉన్న పహల్గామ్‌లోని బైసరన్ వాలీలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందారు (ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలో, “పహల్గామ్‌ ఉగ్ర దాడిలో చనిపోయిన తండ్రి మృతదేహం పక్కనే ఓ హిందూ బాలుడు ఏడుస్తున్న దృశ్యాలు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) . ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 22 ఏప్రిల్ 2025న పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో మృతి చెందిన తండ్రి మృతదేహం పక్కన ఓ హిందూ బాలుడు ఏడుస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): వైరల్ వీడియో కు 22 ఏప్రిల్ 2025న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఘటన 01 జూలై 2020న  జమ్మూ కశ్మీర్‌లోని సోపోర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన తన తాత మృతదేహం పక్కన మూడేళ్ల బాలుడు కూర్చున్న సమయంలోది.  భద్రతా దళాలు అతన్ని రక్షించాయి. తర్వాత ఆ బాలుడిని CRPF సిబ్బంది గుర్తించి, తల్లికి అప్పగించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ 01 జూలై 2020న ప్రచురించబడిన పలు వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాలు ప్రకారం, జమ్మూ కశ్మీర్‌లోని సోపోర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన తన తాత మృతదేహం పక్కన మూడేళ్ల బాలుడు కూర్చున్న సమయంలో సెక్యూరిటీ ఫోర్స్ అతన్ని రక్షించాయి. తర్వాత ఆ బాలుడిని CRPF సిబ్బంది గుర్తించి, తల్లికి అప్పగించారు.

​​కశ్మీర్ జోన్ పోలీసుల అధికారిక X హ్యాండిల్‌లో కూడా 01 జూలై 2020న, ఒక CRPF అధికారి ఒక బాలుడిని మోస్తున్న ఫోటోతో కూడిన పోస్టు షేర్ చేశారు, ఇందులో “సోపోర్‌లో జరిగిన ఉగ్రదాడి సమయంలో బుల్లెట్ల బారిన పడకుండా JKP మూడేళ్ల బాలుడిని రక్షించింది” అని పేర్కొన్నారు.

ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, జూలై 2020లో ప్రచురించబడిన పలు వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాలు ప్రకారం, ఈ కథనాల ప్రకారం, 01 జూలై 2020న, కశ్మీర్‌లోని సోపోర్‌లో మూడేళ్ల బాలుడు తన తాత చనిపోవడాన్ని చూసాడు. ఉగ్రవాదులు, CRPF మధ్య ఎదురుకాల్పుల్లో ఆ బాలుడి తాత బషీర్ అహ్మద్ ఖాన్ చంపబడ్డాడని తెలిపింది. వార్త కథనాల ద్వారా, బాలుడు ముస్లిం కుటుంబానికి చెందినవాడిగా స్పష్టమైంది. దీనిని బట్టి, వైరల్ క్లెయిమ్ లోని బాధితుడు, సంఘటన తప్పుగా చూపబడినట్టు మాకు స్పష్టమైంది.

చివరిగా, జూలై 2020లో జమ్మూ కశ్మీర్‌లోని సోపోర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన తన తాత మృతదేహం పక్కన ఏడుస్తున్న బాలుడి వీడియోను, ఏప్రిల్ 2025లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడితో ముడిపెట్టి తప్పుగా షేర్ చేస్తున్నారు.