ప్రపంచ ఆర్థిక సదస్సులో (World Economic Forum (WEF)) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను అవమానించడానికి ప్రయత్నించినప్పుడు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వార్నింగ్ ఇచ్చాడని చెప్తూ ఒక పోస్టు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఆ సమయంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా అక్కడే ఉన్నారని వైరల్ పోస్టులో పేర్కొన్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ప్రపంచ ఆర్థిక సదస్సులో డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను అవమానించడానికి ప్రయత్నించినప్పుడు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వార్నింగ్ ఇచ్చారు.
ఫాక్ట్: ప్రపంచ ఆర్థిక సదస్సులో సుందర్ పిచాయ్, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య ఇటువంటి సంభాషణ జరిగినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవు. ఇది AI ఉపయోగించి ‘Lit Narrator’ అనే యూట్యూబ్ ఛానెల్ సృష్టించిన కల్పిత కథ. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా, 2025లో జనవరి 20 నుంచి 24 వరకు జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులోని డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న కార్యక్రమాలను పరిశీలించగా, ఈ సదస్సులో ట్రంప్ ప్రత్యక్షంగా పాల్గొనలేదని తెలిసింది. 23 జనవరి 2025న ఆయన ఆన్లైన్ లో పాల్గొన్నట్లు ప్రపంచ ఆర్థిక సదస్సు పేర్కొంది. ఈ కార్యక్రమంలో ట్రంప్ అమెరికాలో పెట్టుబడి అవకాశాలు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, ప్రభుత్వ విధానాలు, గత ప్రభుత్వ వైఫల్యాలు తదితర అంశాల గురించి మాట్లాడారు. ట్రంప్ ప్రసంగం అనంతరం జరిగిన చర్చలో కూడా ఆయన భారత్‌ను అవమానించేవిధంగా మాట్లాడినట్లుగా ఆధారాలు లేవు. అలాగే, సుందర్ పిచాయ్ ఈ చర్చలో పాల్గొనలేదు.
అలాగే, ఈ సదస్సులో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నట్లుగా అధికారికంగా భారత ప్రభుత్వం ప్రకటించలేదు. గతంలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులలో కూడా డొనాల్డ్ ట్రంప్, జైశంకర్, సుందర్ పిచాయ్ మధ్య వైరల్ పోస్టులో చెప్పిన విధంగా సంభాషణ జరిగినట్లుగా ఎటువంటి వార్తా కథనాలు, అధికారిక ప్రకటనలు లేవు. ఇక దీనిపై మరింత పరిశోధించగా, ఈ వైరల్ పోస్టులోని చెప్పబడిన సంభాషణ ‘Lit Narrator’ అనే యూట్యూబ్ ఛానెల్లోని వీడియోల (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) నుంచి తీసుకున్నట్లుగా గుర్తించాం.
జైశంకర్, సుందర్ పిచాయ్, డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ, సత్య నాదెళ్ల వంటి ప్రముఖుల మధ్య వివిధ సందర్భాల్లో సంభాషణ జరిగినట్లుగా AIతో రూపొందించిన వీడియోలను ఈ ఛానెల్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలలో చెప్పిన విషయాలు కేవలం కల్పితం అని, నిజమైన ఘటనలు కాదని ఛానెల్ వివరణలో పేర్కొనబడింది.
చివరిగా, భారత్‌ను అవమానించిన ట్రంప్ కు సుందర్ పిచాయ్ వార్నింగ్ ఇచ్చాడని ఒక ఫేక్ పోస్టు ప్రచారంలో ఉంది.