ఇటీవల, అక్టోబర్ 2024 మూడవ వారంలో భారీ వర్షాల కారణంగా చెన్నై అతలాకుతలమైంది. ఈ భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాల్లోని వేలాది ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ నేపథ్యంలోనే, “ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చెన్నైలోని అన్నానగర్‌లో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరిందని” అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల అక్టోబర్ 2024 మూడవ వారంలో కురిసిన భారీ వర్షాల కారణంగా చెన్నైలోని అన్నానగర్‌లో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది, అందుకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఇటీవల అక్టోబర్ 2024లో భారీ వర్షాల కారణంగా చెన్నైలో సంభవించిన వరదలకు ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో డిసెంబర్ 2023లో మిచాంగ్ తుఫాను కారణంగా చెన్నైలో భారీ వర్షాలు కురిసినప్పటిది. కావున పోస్టు ద్వారా చెప్పేది ‘తప్పుదోవ’ పట్టించే విధంగా ఉంది.
ఇటీవల, అక్టోబర్ 2024 మూడవ వారంలో భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాల్లోని వేలాది ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). భారత వాతావరణ శాఖ (IMD) లెక్కల ప్రకారం చెన్నైలోని కటివాక్కంలో 23 సెంటీమీటర్లు, మనాలిలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే, ఇటీవల భారీ వర్షాల కారణంగా చెన్నైలో సంభవించిన వరదలకు ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియో డిసెంబర్ 2023లో మిచాంగ్ తుఫాను కారణంగా చెన్నైలో భారీ వర్షాలు కురిసినప్పటిది.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను X(ట్విట్టర్)లో ‘@KumbakonamOoru’ అనే యూజర్ 04 డిసెంబర్ 2023న షేర్ చేసినట్లు కనుగొన్నాము.
అలాగే ఇదే వీడియోను పలువురు సోషల్ మీడియా యూజర్స్ డిసెంబర్ 2023లో షేర్ చేసినట్లు మేము గుర్తించాము (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). దీన్ని బట్టి ఇటీవల చెన్నైలో సంభవించిన వరదలకు ఈ వైరల్ వీడియోకు ఎలాంటి సంబంధం లేదని మనం నిర్ధారించవచ్చు.
అలాగే ఇటీవల చెన్నైలో సంభవించిన వరదలకు ముడిపెడుతూ పలు పాత వీడియోలు వైరల్ కాగా, వాటిని ఫాక్ట్ చెక్ చేస్తూ Factly రాసిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఇటీవల భారీ వర్షాల కారణంగా చెన్నైలో సంభవించిన వరదలకు ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదు. రోడ్డుపై భారీగా ప్రవహిస్తున్న వరద నీరును చూపిస్తున్న ఈ వైరల్ వీడియో డిసెంబర్ 2023 నాటిది.